తొలి మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యం.. వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారంటూ నియోజకవర్గ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ
నేటిగద్దర్ న్యూస్, అశ్వరావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 08: అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అశ్వరావుపేటలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారనే వార్త ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. బుధవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న అశ్వరావుపేట నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌ను కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి రావాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి, “నేను వస్తాను” అని తమకు మాట ఇచ్చారని అశ్వరావుపేట బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో కేటీఆర్ రాక ఖాయమని, ఆయన పర్యటనతో అభ్యర్థుల గెలుపు సునాయాసం అవుతుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ అగ్రనేత వస్తున్నారనే సమాచారంతో అశ్వరావుపేట గులాబీ దళంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది.









