+91 95819 05907

ఆయుధ నిర్మాత, సాయుధ సురేష్ (విమల్, @ జాడ వెంకటి) అమర్ రహే

ఆయుధ నిర్మాత, సాయుధ సురేష్ (విమల్, @ జాడ వెంకటి) అమర్ రహే
~ ప్రగతి

11 సెప్టెంబర్ 2025 నాడు గరియాబంద్ జిల్లా అడువులలో మరో విప్లవ త్యాగాల అధ్యాయం లిఖితమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పడిన తరువాత టెక్నికల్ రంగానికి భారీ నష్టాలు జరిగినప్పటికీ, ప్రాణనష్టం జరగలేదనే చెప్పుకోవచ్చు. ఆ యంత్రాంగానికి సంబంధించిన ప్రముఖ టెక్నీషియన్ లు, నాయకులు ప్రమాదవశాత్తు అరెస్టయి సంవత్సరాల తరబడి జైలు పాలైన ఘటనలున్నాయి తప్ప పోలీసుల కాల్పులలో అమరులైనవారు లేరు. కగార్ సైనిక దాడులలోనే ఈ రంగం భారీ నష్టాలు ఎదుర్కోవడం చూస్తున్నాం. మొదట కర్రెగుట్టలలో 21 రోజులు జరిగిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు’ సందర్భంగా జరిగిన నష్టాల తరువాత తిరిగి ఇపుడు గరియాబంద్ లో దాదాపు 55 సంవత్సరాల వయసు కలిగిన డివిజన్ కమిటీ మెంబర్ కామ్రేడ్ సురేష్ (విమల్ @ జాడ వెంకటి) 10 మందితో పాటుగా అమరుడైనాడు.
కామ్రేడ్ సురేష్ కు విప్లవ జోహార్లు అర్పిద్దాం.
జాడ వెంకటి సింగరేణి గని కార్మికుడు. ఆ కొలువులోకి కుదురకముందు ఆయన ఒక శ్రమజీవి. ఆయన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి శివారు గ్రామమైన సండ్రవెల్లిలో ఒక మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించాడు. వారి వృత్తి సుంకరి పని చేయడం. కామ్రేడ్ వెంకటి ఆకారరీత్యా భారీ విగ్రహం, బలంగా వుండడంతో పాటు మనసు రీత్యా పేదలను, శ్రమను గౌరవించే స్వభావం కలిగినవాడు. 1970ల చివరి నుండి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కాలం విప్లవోద్యమ చరిత్రలో బెల్లంపెల్లి అనేక విశిష్టతలను కలిగి వుంది. బెల్లంపెల్లిలోని ఏ కార్మిక బస్తీ ప్రత్యేకత దానిదే అయినప్పటికీ, కన్నాల బస్తీ అన్నింటికి కేంద్రకంగా వుండేది. అలాగే, సండ్రవెల్లి లాంటి అనేక శివారు గ్రామాలపై కార్మిక బస్తీల ప్రభావం మెండుగా వుండేది. కార్మిక బస్తీలకు చేరిన శ్రమజీవులలో చాలా వరకూ వేరు వేరు ప్రాంతాల నుండి ఉద్యోగం కోసం వలస వెళ్లిన పేదవారే కాగా, సండ్రవెల్లి లాంటి గ్రామాలు ముందు నుండి అక్కడివే కావడంతో, ఆ ఊరి జనాలు వేరు వేరు వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిలో అనేక మంది సింగరేణి కార్మికులుగా కూడ కొలువు కుదురుతుంటారు. అలాంటి వారిలో కామ్రేడ్ జాడ వెంకటి ఒకరు.
బెల్లంపెల్లి కార్మిక బస్తీల ప్రభావం శివారు గ్రామాలపై వుండడం అంటే, 1970 ల చివరి నుండి అక్కడ అత్యంత సమరశీలంగా కొనసాగుతున్న కార్మికుల, రాడికల్ విద్యార్థి, యువజనుల విప్లవ కార్యకలాపాల, పోరాటాల ప్రభావం కూడ వుంటుందనీ విడిగా చెప్పాల్సిన పని లేదు. అలా ఆ విప్లవ రాజకీయాలతో ప్రభావితమైన యువతలో కామ్రేడ్ జాడ వెంకటి మొదటి శ్రేణిలోకి వస్తాడు. అందుకు కారణం ఆయన పీడిత (పునాది) వర్గాలకు చెందిన పీడిత కులాల సముదాయానికి చెందిన వాడు కావడంతో పాటు, చిన్నతనం నుండే ఆయనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అణచివేతలను వ్యతిరేకించే సమరశీల స్వభావం వుండడాన్ని మనం కారణం గా చెప్పుకోవచ్చు.
సండ్రవెల్లి గ్రామంలో జరిగే ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించే వారిలో కామ్రేడ్ జాడ వెంకటి ముందుండేవాడు. ఊళ్లోని యువకులతో కలిసి యవ్వనంలో వున్న, జాడ వెంకటిలో చెడును వ్యతిరేకించడం అనే మంచి లక్షణం వుండడంతో, ఆయన గ్రామ దుష్ట పెత్తందార్ల దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షం నిలిచేవాడు. దానితో, కామ్రేడ్ జాడ వెంకటి ఊరి ప్రజల అభిమానాన్ని చూరగొన్న యువ నాయకుడిగా గుర్తింపు పొందాడు. కానీ, దోపిడీ భూస్వామ్య పెత్తందార్లకు ఆయన కార్యక్రమాలు గిట్టడం లేదు. మరోవైపు సింగరేణిలో జరిగే కార్మిక పోరాటాలలో, రాడికల్ల విప్లవ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ వుండేవాడు. ఆయన ప్రజాహిత విప్లవ కార్యకలాపాలతో, ఊరి దుష్ట పెద్దలకు, సింగరేణి యాజమాన్యానికి కంట్లో నలుసయ్యాడు. దీనితో, భూస్వామ్య పెత్తందారులు (ముఖ్యంగా ఆ రోజులలో తెలుగుదేశం పార్టీకి చెందినవారు), సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై పోలీసులతో చేరిపోయి 1987లో కామ్రేడ్ జాడ వెంకటిని దాదాపు నెల రోజులు అక్రమంగా నిర్బంధించారు. ఆ నిర్బంధంలో ఆయనను నరకయాతనలకు గురిచేశారు. వారి చెర నుండి బయటపడిన జాడ వెంకటి జీవితాంతం ఆ దెబ్బల బాధను అనుభవిస్తూనే వున్నాడు. ఆయన భరించిన ప్రతి దెబ్బ తుదివరకూ ఆయనలో ఆరని విప్లవాగ్రహాన్ని రగిలిస్తూనే వుండేది.
కామ్రేడ్ జాడ వెంకటి కుటుంబం సుంకరి పని చేస్తూనే వడ్రంగి పని కూడ చేసేది. దానితో కామ్రేడ్ వెంకటి కర్ర పని చేయడంలో అభిరుచి పెంచుకుని దానిని నేర్చుకున్నాడు. ఊళ్లో ప్రజల మెప్పు పొందుతున్న వెంకటి, బెల్లంపెల్లిలో కార్మికులకు ప్రాణప్రదమైన కార్మికుల సంస్థ ‘సింగరేణి కార్మిక సంఘం’తో కూడ కలిసి దాని కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనసాగాడు. ఆ క్రమంలో ఆయనకు సింగరేణి పార్టీ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ సురేష్ తో పరిచయమైంది. ఆ పరిచయం గాఢంగా మారి వారి విప్లవ కార్యకలాపాలకు సండ్రవెల్లిలోని జాడ కుటుంబం ఒక కేంద్రంగా మారింది. దానితో, కామ్రేడ్ వెంకటిలో కూడ విప్లవం కోసం పూర్తిగా అంకితం కావాలనే కోరిక బలపడసాగింది. మరోవైపు, ఆయన కొనసాగిస్తున్న విప్లవ కార్యక్రమాలతో ఆయన పోలీసుల జాబితాలో చేరి నిత్యం వారి నిఘాలో కొనసాగుతూ ఎప్పుడు ఏ విపత్తు విరుచుకుపడుతుందోననే ప్రమాదకర పరిస్థితులే వెంటాడేవి.
పై పరిస్థితుల నేపథ్యంలో ఇంకా బయట వుండడం ఏంత మాత్రం క్షేమకరం కాదని భావించి కామ్రేడ్ వెంకటి 1995లో తన ఉద్యోగాన్ని వదలుకొని కామ్రేడ్ సురేష్ ప్రోత్సాహంతో పూర్తికాలం విప్లవకారుడిగా రహస్య జీవితానికి వెళ్లాడు. కామ్రేడ్ వెంకటి అప్పటికే తను ప్రేమించిన మహిళను వివాహం చేసుకొని వున్నాడు. వారిది ఆదర్శవంతమైన కులాంతర వివాహం. వారిద్దరు వ్యక్తులుగా, భౌతికంగా ఒకరినొకరు ప్రేమించుకోవడమే కాదు, వారు రాజకీయంగా పరస్పరం ఐక్యమయ్యారు. వారిద్దరు విప్లవ రాజకీయాల కోసం అంకితం కావాలని బాసలు చేసుకున్నారు. అదే విధంగా కామ్రేడ్ ఉష, వెంకటి ఇద్దరూ రహస్య విప్లవ జీవితంలో భాగమయ్యారు. వారిద్దరూ కొంతకాలం సింగరేణి కార్మికుల మధ్యే పని చేశారు. కానీ, ఆ ప్రజల మధ్య, ఆ కార్మికుల మధ్య పని చేసి విస్త్రుతంగా వారికి పరిచయమై వున్న వెంకటి వారి మధ్యే రహస్యంగా పని చేయడం ఆరోజులలో అంత క్షేమకరం కాదని భావించిన స్థానిక పార్టీ నాయకులు వారిని అడవి ఉద్యమంలోకి వెళ్లి పని చేయాల్సిందిగా కోరారు. దానితో, కామ్రేడ్ వెంకటి ఎంతో సంతోషపడి తన సంసిద్దతను వ్యక్తం చేశాడు. కామ్రేడ్ ఉష ఆయనను ప్రోత్సహిస్తూ వుండడంతో వారి జంట అడవిదారి పట్టింది.
కామ్రేడ్ వెంకటి జంట మొదట మంగీ ప్రాంతంలోని గెరిల్లా దళంలో సభ్యులుగా చేరారు. మంగీ ప్రాంతం మొత్తం ఆదిలాబాద్ జిల్లాలోని విప్లవోద్యమ ప్రాంతాలలో టెర్రయిన్ రీత్యా గెరిల్లాలకు చాలా అనుకూలమైన ప్రాంతం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో, పుష్కలమైన నీటి వనరులను కలిగి, మెజార్టీ కోయ (రాజగోండ్) తెగ ప్రజలకు నిలయమైన ప్రాంతం. అక్కడికి చేరిన కామ్రేడ్ వెంకటి తన పేరును మంగన్నగా మార్చుకున్నాడు. అయితే, ఆయన నెల రోజులు భరించిన చిత్రహింసలు ఆ కొండల మధ్య గెరిల్లాల వెంట వుంటూ పని చేయడంలో ఆయనని శారీరకంగా చాలా ఇబ్బందులకు గురి చేశాయి. అయినా, ఆ యవ్వన పట్టుదల ఆయన్ని ఆ బాధలను భరించేలా ప్రోత్సహించేది. కానీ, ఆయన అవస్థలు గమనిస్తున్న తోటి గెరిల్లాలు మాత్రం ఆయనకు పార్టీ మరేదైనా పని కల్పిస్తే బాగుండననే అభిప్రాయానికి వచ్చారు.
1990లలో విప్లవోద్యమం ఆయుధాల తయారీతో పాటు, చేతి గ్రేనేడ్ ల తయారీని అడవిలోనే చేసుకునే విధంగా పార్టీ పథకాలు రూపొందించడం మొదలైంది. ప్రారంభంలో ఆయుధాల తయారీకన్నా, బాంబుల తయారీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దండకారణ్య అటవీ ప్రాంతాలలో సాపేక్షికంగా బలమైన ప్రజాపునాది కలగిన చోట తక్కువ వ్యవధితో కూడిన చేతి గ్రేనేడ్ ల తయారీ వర్క్ షాపులు (కోక్ (రాక్షసి బొగ్గు) తేవడం, బట్టీలు పెట్టడం, సాంచాలతో బాంబులు తయారుచేయడం) మొదలయ్యాయి. అప్పటివరకూ గెరిల్లాలు ఉపయోగిస్తూ వచ్చిన చేతి బాంబుల వాడకం క్రమక్రమంగా నిలిచిపోయింది. దండకారణ్యంలో జరిగే వర్క్ షాపులతో పాటు బయట కూడ ఇలాంటి పనులు సాగేవి.
1998లో ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ బయట చేతి గ్రేనేడ్ల తయారీ వర్క్ షాపుకు ప్లాన్ చేసింది. దానికి అవసరమైన కామ్రేడ్స్ ను ఫీల్డ్ నుండి పంపాల్సిందిగా స్థానిక కమిటీని కోరడంతో, స్థానికంగా టెక్నికల్ పనుల పట్ల ఆసక్తి కలిగిన శక్తులను ఎంపిక చేసి పంపించారు. వారిలో కామ్రేడ్ మంగన్న ఒకరు. కామ్రేడ్ మంగన్న ఫౌండ్రీ పనులన్నింటిలో చాలా శ్రద్ధగా పాల్గొనసాగాడు. ఇసుకను మౌల్డింగ్ కు అనుకూలంగా తయారు చేయడం, ఇసుకతో గ్రేనేడ్ నమూనాను తయారు చేయడం (కోర్ కొట్టడం), కోర్ బాక్సుల్ని మౌల్డింగ్ కు కాల్చి సిద్దం చేయడం, కోక్ (రాక్షసి బొగ్గు)ను భట్టీలో కూర్చడం, ఆపై డ్రమ్ములో కాస్ట్ ఐరన్ కరిగించి పోత పోసేవరకు జరిగే పనులన్నింటిలో కామ్రేడ్ మంగన్న కనపరిచిన శ్రద్ధాసక్తులు అక్కడి బాధ్యులను ఎంతగానో ఆకర్షించాయి. ఇనుమును కరిగించడం అంటే దాదాపు 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ లను మించిన వేడి వద్ద నిల్చుని ఆ ప్రచండ వేడిన్ని భరిస్తూ పని చేయడం ఏమంత మామూలు విషయం కాదు. భరింపరాని వేడి మధ్య ఆ భట్టీ వద్ద నిల్చుండి పని చేసే కామ్రేడ్స్ ఒంటి పై మధ్య మధ్య రెప్పపాటు ఉపశమనం కోసం నీళ్లు చల్లుతూ ఒంటిని చల్లార్చాల్సివుంటుంది. అలాంటి పనిని కామ్రేడ్ మంగన్న నేర్చుకొని దాదాపు రెండేళ్లు ఆ రంగంలో పని చేసిన తరువాత గ్రేనేడ్లను మిషినింగ్ చేసే పని కూడ నేర్చుకొని పూర్తిగా తయారైన చేతి గ్రేనేడ్లను అడవిలోని గెరిల్లాలకు చేర్చేవారు. ఆనాటికి పార్టీలో డ్రమ్ కాస్టింగ్ పై పట్టు సంపాదించిన ఇద్దరు కామ్రేడ్స్ లలో కామ్రేడ్ మంగన్న ఒకడిగా రాణింపు పొందడం ఆయన విప్లవ పట్టుదలనే సూచిస్తుంది. బయటికి వెళ్లిన మంగన్న తనను విప్లవకారుడిగా మలిచి విప్లవోద్యమంలోకి ప్రోత్సహించిన సింగరేణి పార్టీ కార్యదర్శి అమరుడు కామ్రేడ్ సురేష్ పేరునే తన పేరుగా నిలుపుకొని ఆయన ఆశయాల సాధనలో తుదివరకూ నిలిచి తాను లక్ష్య సాధనలో అసువులు బాసాడు.
కామ్రేడ్ మంగన్న చేతి గ్రేనెడ్ల తయారీలో ఎంత పట్టు సంపాదించాడో, అంతే పట్టు పరాయి రాష్ట్రంలో పక్కవారికి కూడ తెలియనంత, అనుమానానికి ఆవగింజంత అవకాశం ఇవ్వకుండా రహస్యంగా కిరాయి ఇళ్లల్లో వుండడం, తన పనులు చేసుకుంటూ వాడకట్టు వారందరితో కలివిడిగా వుండడంలోనూ అంతే పట్టు సంపాదించాడు. ఆ ప్రాంతంలో ఆయన భాష సమస్యను కూడ ఎదుర్కొన్నాడు. కానీ, ప్రజల సహాకారంతో దానిని అధిగమించాడు. ఆనాటికి ఇంత తీవ్రంగా ఆధార్ కార్డ్, తదతర గుర్తింపు కార్డుల సామాజిక సంక్షోభం సమాజాన్ని పీడించడం లేదు. ఐనప్పటికీ తమ ఉనికి బయటపడకుండా వుండే విధంగా అన్ని గుర్తింపులు పొంది విప్లవ కార్యక్రమాలు పూర్తి చేయగలిగారు.
2 డిసెంబర్ 2000నాడు భారత ప్రజల విముక్తి సేన (PLGA) ఆవిర్భవించింది. దానితో, గెరిల్లాల సైనిక నిర్మాణాలు పరిణతి చెందుతూ, విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతున్న సమయంలో వాటిని సాయుధం చేయడానికి అవసరమైన ఆయుధాలను స్వంతంగా తయారు చేసుకోవడానికి పార్టీ దండకారణ్యంలో ఒక ప్రత్యేక ఆయుధ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ లో పని చేయడానికి ఏఓబీ, తెలంగాణ టెక్నికల్ యూనిట్లతో పాటు డీకే యూనిట్ పాల్గొంది. గతంలో ఫౌండ్రీ పనులలో పని చేసిన అనుభవం వున్న కామ్రేడ్ సురేష్ ఇందులో భాగమయ్యాడు. ఫౌండ్రీ పనులకు, తుపాకీ తయారీ (12 బోర్) పనులు పూర్తి భిన్నమైనవే అయినప్పటికీ, టెక్నికల్ రంగంలో శ్రద్ధాసక్తులు వున్న కామ్రేడ్ సురేష్ తెలిసిన వారి నుండి నేర్చుకుంటూ తుపాకుల అసెంబ్లీ పనులపై పట్టు సంపాదించాడు. ఆయనకు ఇంటి వద్దే వడ్రంగి పని వచ్చి వుండడంతో, ఆయన తుపాకులకు బట్ (మాను), ఆర్మ్ వుడ్ (ఫోర్ హ్యండ్ గ్రిప్) లను చక్కగా, చాలా నైపుణ్యంతో, తక్కువ సమయంలో పూర్తి చేసి ఇతరులకు సహాయమందించేవాడు. పార్టీ నడిపించిన రెండు సంవత్సరాల ఆ పైలట్ ప్రాజెక్ట్ లో మంచి అనుభవం సంపాదించి ఆ రంగంలో ఆధారపడతగిన కామ్రేడ్ గా ఎదిగివచ్చాడు.
ప్రజా యుద్ధ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర సైనిక కమిషన్ నిర్ణయించే వివిధ రకాల ఆయుధాలు, గ్రేనెడ్లతో పాటు 12 బోర్ తుపాకులకు అవసరమైన తూటాలను కాగితంతో పాటు ప్లాస్టిక్ మోల్డింగ్ లో తయారుచేసే ప్రాజెక్ట్ ను చేపట్టాల్సిందిగా కమిషన్ ప్లాన్ చేయగా కామ్రేడ్ సురేష్ అందులో భాగమయ్యాడు. అందులో ప్రైమరీ కప్ లను, బేస్ కప్ లను డైలా సహాయంతో పిల్లర్ ప్రెస్ తో వత్తడం మున్నగు టెక్నికల్ పనులలో ఇమిడి వున్న టెక్నిక్ లపై కూడ తన ఆసక్తి నుండి మంచి పట్టు సంపాదించాడు. అలాగే ప్లాస్టిక్ ఇంజక్షన్ మోల్డంగ్ లో తూటా షెల్స్ ను క్యాస్టింగ్ చేయడం, తగిన యంత్రాలు లేని పరిస్థితులలో పనులు చేయాల్సి వచ్చినపుడు ఎదురయ్యే సమస్యలు, అనివార్యంగా అధిక బలప్రయోగం వినియోగించాల్సినపుడు మధ్యంతరంగా వచ్చి పడే అవాంతరాలు, ఆకస్మాత్తుగా ఎదురయ్యే రిపేరింగ్ లు కూడ బయటకు పంపకుండా, లోపలే అష్టకష్టాలు పడుతూ మరమ్మత్తులు చేసుకోవడంలో కామ్రేడ్ సురేష్ పట్టుదల ఆ యూనిట్ బాధ్యులను అబ్బురపరిచేది. తమ యూనిట్ కు ఆయన తగిన వ్యక్తి అని వారంతా భావించేలా కామ్రేడ్ సురేష్ పనులు, వినమ్రత పని చేశాయి.
టెక్నికల్ ప్రాజెక్ట్ లు, ప్రత్యేక పనులు లేని సమయంలో కష్టజీవి సురేష్ ఊరికే ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. సరే, రాజకీయ అధ్యయనం, టెక్నికల్ విషయాలు తెలుసుకోవడంపై కొంత సమయాన్ని కేటాయించినప్పటికీ, పని మధ్యనే వాటిని కొనసాగిస్తే అన్వయింపుతో ఎక్కువగా అర్థమవుతాయనీ ఆయన భావించేవాడు. టెక్నికల్ పనులు పెద్దగా లేనపుడు ఆయన ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల అవసరాలు తీర్చాలని చాలా కోరుకునే వాడు. అలాంటి సమయంలో ఆయనకు గ్రామాలలోని బోరు పైపుల పై దృష్టి పడింది. సర్కార్ బోరింగ్ లు వేయడం మేరకు వేసి తన చేతులు దులుపుకోవడంతో, అవి అనేక గ్రామాలలో పని చేయకుండా సర్కార్ నిర్వాకానికి సాక్షంగా దారిలో వచ్చిపోయేవారికి దర్శనమిచ్చేవి. పాడుపడిన బోరింగ్ లను, సర్కార్ ను తిట్టుకుంటూ ఊరి మహిళలు తిరిగి వాగుకో, వంకకో వెళ్లి నీళ్లు తెచ్చుకోక తప్పేది కాదు.
అలాంటి సమస్యను చేపట్టాలనీ, జనతన సర్కార్లు కూడ పూర్తిగా సహకరిస్తాయనీ భావించిన కామ్రేడ్ సురేష్ ఆ రంగంలో అప్పటికే కొంత అనుభవం సంపాదించిన కామ్రేడ్ శోభ్రాయ్ (కొరోనా కాలంలో అమరుడయ్యాడు) సహాయంతో ఆ పనికి పూనుకున్నాడు. రైతుల వద్ద ఒక సైకిల్ సంపాదించుకొని అవసరమైన రిపేరింగ్ సామాను దానికి వేసుకొని ఊరూరు తిరుగుతూ దక్షిణ, పశ్చిమ బస్తర్ పదుల కొద్ది బోరింగ్ లు బాగుచేశాడు. బోరింగ్ ల రిపేరింగ్ కు అవసరమైన టూల్స్ తమ టెక్నికల్ యూనిట్ నుండి అక్కడ లేనివి రైతుల వద్ద లోకల్ గా దొరికే రాడ్స్ సంపాదించుకొని అవసరానికి అనుగుణంగా టూల్ తయారుచేసుకొని పని నడిపించడం అవసరం నేర్పింది. కామ్రేడ్ సురేష్ పని చూసి ‘బేష్ కీత్తిన్ దాదా’ (మంచి పని చేశావన్నా) అంటూ ఊరి మహిళలు సంతోషంగా నీళ్లు తీసుకెళ్లడం చూసి తన కృషి ఫలించిందనీ తానూ సంబురపడేవాడు.
అడవిలో వివిధ టెక్నికల్ రంగాలలో అనుభవం సంపాదిస్తున్న కామ్రేడ్ సురేష్ ను పార్టీ 2005లో పూర్తిగానే బయటి టెక్నికల్ విభాగానికి కేటాయించింది. దానితో, కామ్రేడ్ సురేష్ జంట బయటి పనులకు వెళ్లింది. అక్కడ కామ్రేడ్ సురేష్ మిషనింగ్ పనులు లేత్, మరియు మిల్లింగ్ పనులు నేర్చుకోవడం మొదలైంది. ఆ క్రమంలోనే దురదృష్టవశాత్తు, అనతికాలంలోనే బహుశా రెండేళ్లలోగానే ఆయన అరెస్టయ్యాడు. 2007 జనవరిలో ఝార్ఖండ్ లోని టాటానగర్ లో వున్న పార్టీ కాంటాక్టుకు వెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వేష్టిగేషన్ బ్యూరో (AP SIB) వారి వలలో చిక్కాడు. ఆ సందర్భంగా వేరు వేరు చోట్ల 8 మంది టెక్నికల్ విభాగ కామ్రేడ్స్ ను వారు పట్టుకున్నారు. కామ్రేడ్ సురేష్ నుండి పార్టీ రహస్యాలు తెలుసుకోవడానికి దాదాపు వారం రోజులు తీవ్రమైన చిత్ర హింసలకు గురిచేశారు. కానీ, ఆయన నోరు విప్పలేదు. దానితో చివరకు ఆయనను ఖమ్మం అడవులలో అరెస్టు చేసినట్టు కోర్టులో ప్రవేశపెట్టి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
కామ్రేడ్ సురేష్ తో పాటు అరెస్టయిన వారంతా దాదాపు 30 మాసాలు జైలు జీవితం గడిపారు. కామ్రేడ్ సురేష్ జైలులో కిచన్ బాధ్యతలు చూసుకునే వాడు. జైలులో ఏర్పాటైన జైలు కమ్యూన్ కామ్రేడ్ సురేష్ ను ఆ బాధ్యతలు నిర్వహించాలనీ కోరినపుడు ఆయన ఎలాంటి తటపటాయింపు లేకుండా 30 మాసాల కాలం ఆ బాధ్యతలు నిర్వహించాడు. మరోవైపు, ఆ కాలంలో వారంతా జైలులోని ఖైదీల సమస్యలపై అనేక పోరాటాలు చేపట్టారు. దాదాపు యేణ్ణర్ధ కాలం రిలే నిరహార దీక్షలు కొనసాగించారు. ఖైదీల పట్ల మహిళలనే విచక్షణ సైతం లేకుండా వార్డర్ లు, పోలీసులు, అధికారులు అవలంబించే దురుసు ప్రవర్తనను వ్యతిరేకిస్తూ, బంధు మిత్రులు కలుసుకోవడానికి వెళ్లినపుడు మాట్లాడుకునే సమయంలో మధ్య జాలీ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ముఖాముఖి ఏ కృత్రిమ అడ్డు లేకుండా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలనీ, ఖైదీలకు సరైన చికిత్సా సౌకర్యాలు కల్పించాలనీ, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించాలనీ, కొన్ని సందర్భాలలో ఖైదీల అకాల మరణానికి దారి తీసిన ఘటనలపై న్యాయవిచారణ జరుపాలనీ నిరహారదీక్షలకు పూనుకోవడం లాంటి అనేక సమస్యలపై జైలులోని విచారణలో వున్న ఖైదీలను, శిక్షలు పడిన ఖైదీలను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నడిపారు. ఆ పోరాటాలలో కామ్రేడ్ సురేష్ చురుగ్గా పాల్గొనేవాడు. వారి పోరాటాల ఫలితంగా వారి డిమాండ్లు చాలా వరకు నెరవేర్చుకున్నారు. మన దేశంలో ‘నేరస్థులకు’ జీవిత ఖైదు శిక్ష పడినప్పటికీ 7-10 సంవత్సరాల శిక్షా కాలం పూర్తి చేసిన వారి ప్రవర్తను పరిశీలించి వారిని విడుదల చేసే సంప్రదాయం చాలా కాలం మన దేశంలో కొనసాగింది. కానీ, పాలకవర్గాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల నేపథ్యంలో అలాంటి సంప్రదాయాలకు చెల్లుచీటీ ఇవ్వడం ఇటీవలి కాలంలో సాధరణమైంది. జీవితఖైదు శిక్ష పడినవారు యావజ్జీవితం కటకటాల వెనుక మగ్గడం తప్ప మరే గత్యంతరం లేకుండా పోయింది.
2009 జులైలో కామ్రేడ్ సురేష్ పై మోపిన కేసును సెషన్స్ కోర్టు కొట్టివేయగా, జైలు నుండి బయటపడ్డాడు. ఆయన ఆ వెంటనే పార్టీ పిలుపుపై సంతోషంగా తిరిగి రహస్య జీవితానికి వెళ్లాడు.
2010-13 మధ్య కామ్రేడ్ సురేష్ దండకారణ్యంలోని వివిధ టెక్నికల్ యూనిట్స్ లో పని చేశాడు. భారత విప్లవోద్యమం ఆపరేషన్ గ్రీన్ హంట్ సైనిక దాడులను ఎదుర్కొంటున్న కాలం అది. ముఖ్యంగా దండకారణ్యం, ఝార్ఖండ్ లను బేస్ ఏరియాలుగా నిర్మాంచాలని పార్టీ చేపట్టిన కేంద్ర కర్తవ్యంలో భాగంగా దండకారణ్యంలో టెక్నికల్ రంగం కూడ అందుకు అవసరమైన అన్ని హంగులను సమకూర్చుకుంటూ ప్రజాయుద్ధ అవసరాలను తీర్చే విధంగా తయారవుతున్న సమయంలో కామ్రేడ్ సురేష్ డీకేలోని వివిధ యూనిట్లలో పని చేసి వివిధ రకాల అనుభవాన్ని గడించాడు. ఆ అన్ని అనుభవాల సమాహారంగా ఆయన స్వతంత్రంగా ఒక యూనిట్ నడుపగలిగే సామర్ధ్యాన్ని సంపాదించాడు. ఆయుధాల రిపేరింగ్ తో పాటు వెల్డింగ్, సాల్డరింగ్ లాంటి రకరకాల నైపుణ్యాలను ఒంటపట్టించుకున్నాడు. తాను టెక్నికల్ రంగంలో మంచి నిపుణుడిగా రాణిస్తూనే యూనిట్ లో ఎదురయ్యే ఆర్గనైజేషనల్ సమస్యలను విజ్ఞతతో పరిష్కరించే విధంగా కామ్రేడ్స్ అందరితో అనుబంధాన్ని పెంచుకునేవాడు.
ఉద్యమ విస్తరణలో భాగంగా దండకారణ్యం-ఝార్ఖండ్ లను అనుసంధానించడానికి ఏర్పడిన నూతన ఎర్ర ప్రతిఘటన ప్రాంతం సీఓబీ (ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతం)లో టెక్నికల్ అవసరాలను తీర్చడానికి పార్టీ కామ్రేడ్ సురేష్ ను 2012 ఆగస్టులో అక్కడికి వెళ్లాలని కోరడంతో ఆయన వెంటనే సిద్ధపడ్డాడు. అప్పటి నుండి ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆ ప్రాంతంలోనే టెక్నికల్ రంగంలో కొనసాగాడు. మొదట కొంత కాలం టెక్నికల్ రంగ నాయకత్వ టీంలో సభ్యుడిగా, పిదప నాయకత్వ బాధ్యతలలో కొనసాగాడు. ఆ ప్రాంతం 2013 నుండి సీఓబీ బదులు ఒడిశా రాష్ట్ర ఉద్యమంగా వ్యవహరించబడుతోంది.
సీఓబీ ప్రాంతం కొత్తది కావడంతో, ప్రజా పునాది బలంగా లేకపోవడంతో, టెక్నికల్ రంగ అవసరాలను తీర్చుకోవడం అత్యంత సమస్యాత్మకంగా వుండేది. కామ్రేడ్ సురేష్ గెరిల్లాల చేతిలోని ఆయుధం ఎల్లవేళలా శత్రువును ఎదుర్కోవడానికి సిద్దంగా వుండాలనీ బలంగా వ్యక్తం చేసేవాడు. దానితో, ఆయన అవసరమైన టూల్స్, మెటీరియల్ ను సంపాదించుకోవడానికి రకరకాల సోర్సులను సంపాదించుకోవడానికి, స్థానిక కామ్రేడ్స్ ను సంప్రదించి వారి నుండి సంబంధాలను రాబట్టుకోవడానికి కృషి చేసేవాడు. గెరిల్లాల చేతిలోని ఆయుధం సరిగా లేకపోతే, అది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందనీ, గెరిల్లాలు నిరంతరం తమ ఆయుధం-మందుగుండును సురక్షితంగా, దెబ్బతినకుండా

సీఓబీ ప్రాంతం కొత్తది కావడంతో, ప్రజా పునాది బలంగా లేకపోవడంతో, టెక్నికల్ రంగ అవసరాలను తీర్చుకోవడం అత్యంత సమస్యాత్మకంగా వుండేది. కామ్రేడ్ సురేష్ గెరిల్లాల చేతిలోని ఆయుధం ఎల్లవేళలా శత్రువును ఎదుర్కోవడానికి సిద్దంగా వుండాలనీ బలంగా వ్యక్తం చేసేవాడు. దానితో, ఆయన అవసరమైన టూల్స్, మెటీరియల్ ను సంపాదించుకోవడానికి రకరకాల సోర్సులను సంపాదించుకోవడానికి, స్థానిక కామ్రేడ్స్ ను సంప్రదించి వారి నుండి సంబంధాలను రాబట్టుకోవడానికి కృషి చేసేవాడు. గెరిల్లాల చేతిలోని ఆయుధం సరిగా లేకపోతే, అది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందనీ, గెరిల్లాలు నిరంతరం తమ ఆయుధం-మందుగుండును సురక్షితంగా, దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనీ హెచ్చరించేవాడు.
ఒడిశాలో ఎత్తైన కొండల మధ్య, కఠినమైన టెర్రయిన్ లో గెరిల్లాలు బరువులతో ప్రయాణాలు చేస్తున్నపుడు జారి పడిపోవడం సర్వ సాధారణం. అలాంటి సమయంలో కొన్ని సందర్బాలలో వారి చేతిలోని ఆయుధం దెబ్బతినే అవకాశం కూడా వుంటుంది. మరీ ముఖ్యంగా ఇన్సాస్ కు సింథటిక్ మాగ్జిన్ వుండడంతో అది పగిలిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. వాటిని తిరిగి సరైన టూల్స్ లేని చోట తయారు చేయడం చాలా దుర్లబంగానే వుండేది. అయినప్పటికీ, ప్రజల సహాయంతో వివిధ రకాల ఇనుప ముక్కలను సేకరించుకొని, నాగలి కర్రు పట్టీలను సమకూర్చుకొని షీట్ ను బెండ్ చేయడానికి ప్రెస్ లేకపోవడంతో, అది తెచ్చుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించక పోవడంతో సృజనాత్మకంగా ఆలోచించి పనులు పూర్తి చేసుకునేవాడు. గ్రామాలలో ట్రాక్టర్ వున్న రైతుల వద్దకు వెళ్లి వారి జాకీ అడిగి తీసుకొని దానితో బెండింగ్ పనులు పూర్తి చేసుకొని సిల్వర్ బ్రీజింగ్ పని పూర్తి చేసి గెరిల్లాల చేతుల్లో ఆయుధం పెట్టడంలో తన యూనిట్ వారందరి కృషి ఎంతో ప్రశంసనీయంగా వుండేది. అలా పనులు పూర్తి చేయడం అంటే, కామ్రేడ్ సురేష్ కు అవి ఎంత కష్టభరితమైనా వెనుకాడకుండా పూర్తి చేయడంలో తన యూనిట్ ను ప్రోత్సహించి రంగంలోకి దింపేవాడు. తాను ముందుండేవాడు.
శారీరకంగా తనకు ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా తన పని ప్రభావితం కాకూడదనీ బలంగా అనుకునేవాడు. ఆయనకు మలేరియా జ్వరం వచ్చినపుడు కొన్ని సందర్భాలలో టైఫాయిడ్ కూడ తోడైతే చాలా ఇబ్బంది పడేవాడు. అవసరాల రీత్యా ఒడిశాలోని తూర్పు సబ్ జోన్ కు వెళ్లి తిరిగి పశ్చిమ సబ్ జోన్ కు చేరుకోవాలంటే, ఒక్కొక్క రోజు 16-18 గంటల ప్రయాణం తప్పేది కాదు. అలాంటి దీర్ఘ ప్రయాణాలలో కాళ్లకు బొబ్బలు వచ్చినప్పటికీ, పంటి బిగువున బాధను భరించేవాడు తప్ప మరేం మాట్లాడేవాడు కాదు. ఆయన టెక్నికల్ రంగంలో పని బాధ్యుడైనప్పటికీ అవసరాల రీత్యా ఏ పనికి వెళ్లాలన్నా వెనుకాడేవాడు కాడు. తన వల్ల కాదని చెప్పిన సందర్భాలు బహుశా లేవంటే తప్పు కాదేమో! వివిధ ప్రాంతాలలో పని చేసిన అనుభవం వుండడంతో ఫీల్డ్ లో కొన్ని పనులు చాకచక్యంగా చేయాల్సిన వాటికి కామ్రేడ్ సురేష్ నే బాధ్యులు పంపేవారు. ఆయా పనుల ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఆయన వెళ్లి పనులు పూర్తి చేసుకొని వచ్చేవాడు.
ఒడిశాలో ఒకవైపు ప్రజాయుద్ధ అవసరాలు పెరుగుతుండడం, మరోవైపు, శత్రువు దాడులు ముమ్మరం అవుతున్న పరిస్థితులలో నిలకడగా పనులు చేసుకునే పరిస్థితే కరువైంది. ఇలాంటి పరిస్థితులలో ఒడిశా టెక్నికల్ టీం డీకేలోనే వుండి తమ అవసరాలు తీర్చుకోవాలనీ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఒడిశా యూనిట్ 2022 వర్షాకాలం డీకే చేరింది. డీకేలో తయారవుతున్న బెటాలియన్ గ్రేనేడ్ లాంచర్ (బీజీఎల్)లు, షెల్స్ తయారీలో భాగమయ్యాడు. బీజీఎల్ పేరు తర్వాతి కాలంలో ఎస్.జీ.ఎల్ గా మార్చడం జరిగింది. వీటితో పాటు సుర్కాలు తయారు చేయడం కూడ నేర్చుకున్నాడు. ఎక్కువ సమయం ఈ పనులలో వుండడంతో ఆయన స్వతంత్రంగా వీటిని తయారు చేయగల నేర్పరి అయ్యాడు. ఈ పనుల నిర్వహణకు డీవీసీ స్థాయి కామ్రేడ్స్ తో ఏర్పడిన టెక్నికల్ ప్రాజెక్ట్ కమిటీలో కామ్రేడ్ సురేష్ భాగమయ్యాడు. తాను తన వర్క్ డివిజన్ ప్రకారం చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేస్తూ సమష్టి పనులలో చురుగ్గా పాల్గొనేవాడు.
కామ్రేడ్ సురేష్ లో అనేక రకాల నైపుణ్యాలు వుండడంతో ఆయన పని సమయంలో ఒక్క క్షణమైనా విశ్రాంతి కోరుకునే వాడు కాడు. తన పని తాను పూర్తి చేసుకున్నాక దొరికే సమయంలో ఆయన ఒక తపంచా తయారీ (చిన్న తుపాకి)కి ప్లాన్ చేసుకొని పూర్తి చేశాడు. ఫీల్డ్ లో పెరుగుతున్న పోలీసు దాడుల మధ్య ప్రజల మధ్యకు సైనిక దుస్తుల్లో, పెద్ద ఆయుధాలతో వెళ్లడానికి పరిస్థితులు అనుమతించేవి కావు. దానితో సివిల్ దుస్తులలో, పెద్ద ఆయుధాలకు బదులు చిన్న ఆయుధాల ఆవశ్యకత తీవ్రంగా ముందుకు రావడంతో, ఎక్కడికక్కడే టెక్నికల్ రంగంలో అనుభవం వున్న కామ్రేడ్స్ వాటి రూపకల్పనకు పూనుకున్నారు.

జనవరి, 2024 నుండి మావోయిస్టుల నిర్మూలన కోసం రూపొందిన నూతన సైనిక పథకంలో భాగంగా కగార్ సైనిక దాడులు అపూర్వ స్థాయిలో మొదలయ్యాయి. ఈ దాడులలో ఒకవైపు ప్రధాన నాయకత్వాన్ని మట్టుబెట్టడం, మరోవైపు టెక్నికల్ యూనిట్లను లక్ష్యంగా చేసుకొని దెబ్బతీయడంగా విశాల ప్రాంతాలలో చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులు కొనసాగు తున్నాయి. కామ్రేడ్ సురేష్ పని చేసే యూనిట్ గత యేడాదికి పైగా కాలంలో మూడు సార్లు చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులలో ఇరుక్కుంది. కానీ, ఎలాంటి నష్టాలు లేకుండా చాకచక్యంగా ప్రజల మద్ధతుతో తప్పుకోగలిగింది. అనేకసార్లు ప్రమాదాలు తృటిలో తప్పాయి. టెక్నికల్ యూనిట్ వారు తయారుచేసి అడవిలో పెట్టిన డంపులు (నిల్వలు) పోలీసుల గాలింపు చర్యలలో వెల్లడి కావడంతో, వాటిని తగులబెట్టడం, పగులకొట్టడం, ధ్వంసం చేయడం లాంటి చర్యలు పోలీసులు చేసి ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించారు. ఇలాంటి పరిస్థితులలో యూనిట్ గురించి తెలిసిన వ్యక్తులు పారిపోయి పోలీసులకు లొంగిపోవడంతో యూనిట్ అస్థిత్వానికి తీవ్ర ముప్పు ఏర్పడింది.
ఒకవైపు కగార్ దాడులు, మరోవైపు కామ్రేడ్ సురేష్ కు వయసుతో పాటు కీళ్ల నొప్పులు తీవ్రం కాసాగాయి. పెరిగిన వయసుతో కళ్ల చూపు మందగించి స్థానికంగా సమకూర్చుకునే కళ్లజోడుతో పని నడిపించే స్థితి లేకుండా పోయింది. స్థానికంగా సమకూర్చుకోవడం అంటే, కళ్ల పరీక్షలకు అవకాశం లేకుండాపోయిన చోట 10 మంది కామ్రేడ్స్ ధరించే కళ్లజోడులలో ఎవరి కళ్లజోడు ధరిస్తే సరిగా సరిపోతుందో చూసుకొని వాటిని తెప్పించుకొని వాడుకోవడమే. నిజానికి ఆయన వయసు ఆ జబ్బులకు అంతగా ప్రభావితం అయ్యేది కానప్పటికీ, ఆయన తన జీవితంలో రెండు సార్లు పోలీసుల చేతిలో తీవ్రమైన చిత్రహింసలు అనుభవించడంతో ఆరోగ్యం దెబ్బతినడానికి అది ప్రధాన హేతువైంది. అనారోగ్యానికి చికిత్స చేయించుకునే పరిస్థితులు లేకుండాపోయాయి. టెక్నికల్ యూనిట్లు ఏవీ గతంలా పని చేసే పరిస్థితి కూడ లేకుండా పోయింది. ఒకే చోట అధిక సంఖ్యలో నిపుణులైన కామ్రేడ్స్ వుండడం క్షేమకరం కాని పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితులలో పార్టీ ఆలోచించి కామ్రేడ్ సురేష్ జంట తిరిగి ఒడిశా వెళ్లడమే మంచిదని నిర్ణయించింది.
కామ్రేడ్ సురేష్ జంట మార్చ్ 2025లో దండకారణ్యం నుండి బయలుదేరింది. వందల కిలోమీటర్లు నడిస్తే కానీ వారి గమ్యం చేరుకోలేరు. దారి పొడవునా ప్రమాదాలు పొంచి వున్న పరిస్థితులలో గెరిల్లాల, ప్రజల అండదండలతో ప్రయాణించారు. మధ్యలో పోలీసుల చూపు నుండి తృటిలో తప్పుకొని కాల్పులకు గురికాకుండా వుండిపోయారు. ఎట్టకేలకు నెల రోజుల ప్రయాణం తరువాత గమ్యానికి చేరుకున్నారు. కానీ, అక్కడా కగార్ దాడులు, పారుబోతుల సమస్య గతం కన్నా పెరిగింది. టెక్నికల్ పనులు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. అనేక మంది కామ్రేడ్స్ తమ తుపాకులు సమస్యాత్మకంగా వున్నాయనీ కామ్రేడ్ సురేష్ వద్దకు వచ్చి చెప్పుకునేది. తను చేయగలిగిన మేరకు వాటిని సవరించడానికి పూనుకునేవాడు. కానీ, టూల్స్ లేకుండా, ప్రజల సంబంధాలలోకి వెళ్లకుండా, మెటీరియల్ సంపాదించుకోకుండా ఎంతటి నైపుణ్యం వున్నా ఏమీ చేయలేని దుస్థితిలో కామ్రేడ్ సురేష్ టీమంతా చాలా విచారించేవారు. కానీ, విప్లవోద్యమంలో గెరిల్లాల పోరాటంలో ఇలాంటి సందర్భాలను ఎదుర్కోక తప్పదనే చైతన్యంతో వారు పరిస్థితులను అధిగమించడానికి పట్టుదలతో పని చేసేవారు.
మారుతున్న పరిస్థితులలో కామ్రేడ్స్ ఎంత పట్టుదలగా పని చేసినప్పటికీ, నిత్యం, క్షణ, క్షణం పొంచి వుండే ప్రమాదకర పరిస్తితులలో జీవించడం కత్తిమీద సాములాగే మారింది. అలాంటి పరిస్థితులలో 11 సెప్టెంబర్ రోజు వారి గురించి పోలీసులకు పూర్తి సమాచారం వెళ్లడంతో వారు చుట్టుముట్టి మట్టుబెట్టే దాడికి గురయ్యారు. ఆ దాడిలో కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ మనోజ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ ప్రమోద్, కామ్రేడ్ సురేష్ సహ 10 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. వారంతా తాము నమ్మిన ఆశయాల కోసం ప్రజాయుద్ధంలో శత్రువుతో వీరోచితంగా పోరాడుతూ అసువులు బాసారు. వారి రక్త తర్పణంతో సోనబేడ కొండలు, మైన్ పుర్ అడవులు ఎరుపెక్కాయి. ఆ ఎర్రెర్రని అడవులలో, రేపటి భవిష్యత్తులో అమరులు తిరిగి తమ ఆశయాల సాధనలో సదా వెలుగొందుతుంటారు.

కామ్రేడ్ సురేష్ మిలిటరీ రంగంలో కూడ మంచి ధైర్య సాహసాలు కల కామ్రేడ్. ఆయన శత్రువు దాడులలో నిబ్బరంగా వుంటూ తన తోటి కామ్రేడ్స్ ను గాబరాకు గురికాకుండా నిలిపి ప్రతిఘటనలో భాగం చేసేవాడు. ఆయన అవసరమైనపుడు టీసీఓసీలలో సంతోషంగా పాల్గొనేవాడు. కామ్రేడ్ సురేష్ రాజకీయ, నిర్మాణ రంగంలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను బాధ్యులతో లోతుగా చర్చించేవాడు. ఆయన ఒడిశాలో 2015లో జరిగిన మొదటి రాష్ట్ర మహాసభలో ప్రతినిధిగా పాల్గొని తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రతినిధులతో, నాయకత్వంతో పంచుకున్నాడు. 2017లో కేకేబీఎన్ (కంధమాల్, కలహండీ, బౌద్ధ్, నయాగఢ్) పార్టీ ప్లీనంలో కూడ పాల్గొన్నాడు. ఆయన దండకారణ్యంలో సల్వాజుడుం బీభత్స సమయంలో భైరంగఢ్ ప్రాంతంలో వుండి గెరిల్లాల ప్రతిఘటన చర్యలలో పాలు పంచుకున్నాడు. ఆయన ఎక్కడ వున్నా, అక్కడి కామ్రేడ్స్ చేసే పనులలో చొరవతో పాల్గొనడం, సైనిక చర్యలలో భాగం కావడం, గెరిల్లాల ఆయుధాలు రిపేరింగ్ చేసి ఇవ్వడం ఆయనకు కమ్యూనిస్టు చైతన్యం అందించిన సుగుణాలు. అలాంటి అనుభవ సంపన్నులైన కామ్రేడ్స్ అమరత్వం భావి తరాలకు ఎన్నెన్నో గుణపాఠాలను అందిస్తుంది. ఆ గుణపాఠాల వెలుగులో భారత విప్లవం జయప్రదం అయి తీరుతుంది.
(నోట్: సండ్రవెల్లి నుండి బెల్లంపెల్లి మీదుగా దండకారణ్యానికి కలుపుకుంటూ ఒడిశా వరకు కామ్రేడ్ సురేష్ తో కలిసి పని చేసిన పలువురు కామ్రేడ్స్, జైలులో ఆయనతో పాటు విచారణలో కొనసాగిన సహచరులు అందించిన వివరాల సమాహారం కామ్రేడ్ జాడ వెంకటి ఉద్యమ ప్రస్తాన వివరాలు.)

జనవరి 2026
ప్రగతి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !