*నల్గొండలో దారుణ ఘటన – ప్రాణాలతో బయటపడ్డ కారు యజమాని ఇమ్రాన్*
నల్గొండ జిల్లాలో మానవత్వాన్ని దుర్వినియోగం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరిన ఇమ్రాన్ అనే వ్యక్తి, *మార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్నాడు.*
అయితే చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఇమ్రాన్‌పై కత్తితో దాడి చేశాడు. *ఇమ్రాన్ మెడతో పాటు శరీరంపై విచక్షణ లేకుండా కత్తిపోట్లకు పాల్పడి, అతని సెల్‌ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.*
తీవ్ర గాయాల మధ్య కూడా ఇమ్రాన్ ధైర్యంగా ప్రతిఘటించడంతో, భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.*రక్తపు మడుగులో పడి ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.* అతడిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. *హైవేలపై లిఫ్ట్ ఇచ్చే విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.*








