ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్,ఖమ్మం:
ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన గోడ పత్రికలను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రతి పౌరుడికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం మనం అధికంగా ఫోన్ ద్వారా లావాదేవీలు చేస్తున్నామని, సైబర్ నేరగాళ్ళు మన ఫోన్ నుంచి సమాచారం సేకరించి బ్యాంకులో ఉన్న డబ్బును దోచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ప్రముఖ వైద్యులు, వ్యాపార వేత్తలు కూడా సైబర్ మోసాలకు గురయ్యారని అన్నారు. మన ఫోన్ పాస్ వర్డ్ 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలని, ముఖ్యమైన ఖాతాలకు తప్పనిసరిగా 2 ఫ్యాక్టర్ అతెంటికేషన్ పెట్టాలని, కె.వై.సి. వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్.ఎం.ఎస్. లో వచ్చే ఫ్రాడ్ లింకులను మనం క్లిక్ చేయవద్దని, ఫోన్ కాల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ.టి.పి, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికి ఇవ్వవద్దని అన్నారు. వాట్సాప్ ద్వారా కలెక్టర్, ఉన్నతాధికారుల పేర్ల మీద మెసెజ్ చేస్తూ డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారని, మనం ఒకరికి డబ్బులు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోవాలని అన్నారు.
ఫోన్ లో అడ్డమైన యాప్ లను డౌన్ లోడ్ చేయవద్దని, యాప్ లకు అనుమతులు ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మన కుటుంబానికి ఎటువంటి భీమా తీసుకోవాలి, మనం పెట్టుబడులు పెట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మన ఇంటిలో ఉన్న వృద్దులను కూడా సైబర్ నేరాల పట్ల జాగృతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, ఎల్డిఎం ఏ. రవిప్రసాద్, టిజిబి రీజనల్ మేనేజర్ ఏ. ప్రసన్న కుమార్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రీ రామ్ బరన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








