వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్
వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం
బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే విధ్వంసానికి పాల్పడి , ప్రజల జీవించే హక్కులను కాల రాయడం దుర్మార్గం , బాధితులకు బాసటగా బి.ఆర్.ఎస్ నిలుస్తోందని , బాధితులను పరామర్శించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారని ఎమ్మెల్సీ , బి ఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ అన్నారు.
బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 25 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమానికి తెరలేపిందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.లగచర్లలో గిరిజన సోదరుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లాక్కునేందుకు అర్ధరాత్రి పూట పోలీసులను, పారా మిలటరీ బలగాలను పంపి గర్భిణీలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేశారు. “రేవంత్ అంకుల్.. మంచి చేస్తారని ఓటు వేస్తే మా ఇళ్లు కూల్చారు” అని చిన్న పిల్లలు ఏడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కనీసం జాలి కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఖమ్మం నడిబొడ్డున వెలుగుమట్ల గ్రామంలో జరిగిన ఘటన అత్యంత అమానుషం. భూదాన్ ట్రస్ట్ బోర్డు ద్వారా పట్టాలు పొంది, గత కొంతకాలంగా నివసిస్తున్న 1895 మంది పేద కుటుంబాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో పోలీసులను మోహరించి ,ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. పత్రికా స్వేచ్ఛను హరించి, మీడియాను కూడా అనుమతించకుండా ఒక ఎన్‌కౌంటర్ సీన్‌ను తలపించేలా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం చేరుకోనున్నారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించి, ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
వెలుగుమట్ల బాధితులందరికీ తక్షణమే పునరావాసం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని. మానవ హక్కుల ఉల్లంఘనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తా తా మధుసూదన్ డిమాండ్ చేశారు
రేపటి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు , జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని, బాధితులకు అండగా నిలవాలని పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్, లీగల్ సెల్ బిచ్చాల తిరుమలరావు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఉద్యమకారులు పగడాల నరేందర్, నాయకులు తాతా ప్రసాద్, హనుమంతరావు, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ, మంచా నాయక్ , తదితరులు పాల్గొన్నారు.








