నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు.వెలుగుమట్ల భూదాన్ భూములకు చెందిన సిరికొండ కళ్యాణి తన ఇల్లు కూల్చేశారని, తనకు ప్రభుత్వం తరఫున అందించే సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఈ విభాగం అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం అర్బన్ మండలంలో సారధి నగర్ కు చెందిన గాలి నాగేశ్వరమ్మ తాము గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ఇంటిని రోడ్డు విస్తరణలో తొలగించాలని చూస్తున్నారని, తమకు ఆర్థిక సహాయం చేసి, మరోచోట ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఈ విభాగం అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామ సర్పంచ్ కొండూరి పరిశుద్ధ రావు గ్రామంలో రైతులు పండించిన మొక్కజొన్న మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరపై కొనుగోలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మార్క్ ఫెడ్ అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
ఖమ్మం పట్టణానికి చెందిన దళిత వర్గీయులు గత ప్రభుత్వంలో 320 మంది లబ్ధిదారులకు దళిత బంధు నిధులు మంజూరి అయి ఉన్నాయని, వాటిని తమకు మంజూరు చేసి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈడి ఎస్సీ కార్పొరేషన్ కు రాస్తు పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.








