నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కామేపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.జాస్తిపల్లి గ్రామంలో 3 కోట్ల 15 లక్షలతో జాస్తిపల్లి నుండి కెప్టెన్ బంజర రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, లాల్యతండ గ్రామంలో 3 కోట్ల 33 లక్షలతో లాల్యతండ ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగన్నాథ తండ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఊటుకూరు గ్రామంలో ముత్యాలంపాడు గుడి నుండి శ్మశాన వాటిక వరకు కోటి 80 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, తాళ్ళగూడెంలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి డోర్నకల్ ఆర్ అండ్ బి రోడ్డు వయా టేకులతండ, పింజరిమడుగు, పాతలింగల మీదుగా 4 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
దీంతో పాటు ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో నిర్మించిన రెండు పడక గదుల నిర్మాణాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ గత పాలకులు వైఎస్సార్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను అవహేళన చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు నిర్మిస్తామని హామి ఇచ్చి 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చి ఇండ్లు కట్టకుండా మోసం చేశారని మంత్రి మండిపడ్డారు. ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా ఉంచిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసామని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇండ్లు కూడా నిర్మించలేదని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మార్చి చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు. పేదింటి మహిళలు ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే కోరిన రోడ్డు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఊటుకూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం మంజూరు చేసి అసంపూర్తిగా ఉంచిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ఇక్కడ ఉన్న విద్యుత్ సమస్య, ఇతర మౌళిక వసతుల సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.








