సోషల్ మీడియా వచ్చాకా.. ఎవరి మనోభవాలు దెబ్బతిన్నా అందులోనే కొట్టుకోవడం మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్ లో కానీ, సాంగ్ లో కానీ, సినిమాలో కానీ ఏ చిన్న పదం అభ్యంతరకరంగా ఉన్నా కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుపుతూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా కేసీఆర్ డైలాగ్ ను ఒక సినిమా సాంగ్ లో వాడినందుకు బిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.
ఉస్తాద్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక నిన్న.. డబుల్ ఇస్మార్ట్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మార్ ముంతా.. చోడ్ చింతా అంటూ సాగిన ఈ సాంగ్ ను మాస్ మసాలా లిరిక్స్ తో ముంచెత్తారు. ఇంకోపక్క కావ్య అందాల ఆరబోత ఒక ఎత్తు అయితే రామ్ స్టెప్స్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో కేసీఆర్.. ఒక ఇంటర్వ్యూలో వాడిన ఏం జేద్దామంటావ్ మరి అనే డైలాగ్ ను ఉపయోగించారు. దీంతో బిఆర్ ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
కల్లు కాంపౌండ్ లో తాగే పాటలో కేసీఆర్ డైలాగ్ ను ఉపయోగించడం ఆయన్ను అవమానించినట్టే అని, కనీసం ఆ లిరిక్స్ కానీ, ఆ హీరోయిన్ బట్టలు కానీ సరిగ్గా లేవని.. వెంటనే ఆ డైలాగ్ ను రిమూవ్ చేయాలనీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం తాగుడు కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ లా పూరీ చూపించిన విధానం తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైలాగ్ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.