◆ఫైర్ కోల్ తో కార్మికుల ప్రాణాలకు ముప్పు…
◆సింగరేణి యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టాలి…TBGKS వైస్ ప్రసిడెంట్ నాగెళ్ళి వెంకటేశ్వర్లు.
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 28:
నైనారపు నాగేశ్వరరావు✍️
మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 4 నుంచి KCHPకి నిరంతరం లారీల ద్వారా రవాణా చేస్తున్న ఫైర్ కోల్ బంకర్ లో అన్ లోడ్ చేసే సమయంలో దట్టమైన పొగ వెలువడుతుందని ఆ పొగ KCHP కార్మికులకు ప్రాణ సంకటంగా మారిందని నివారణా చర్యలు చేపట్టవలసిన అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం వల్ల కార్మికుల విలువైన ప్రాణాలు అర్దాయుషుతో ముగిసే ప్రమాదం ఉందని ఏరియా TBGKS మణుగూరు బ్రాంచి ఉపాధ్యక్షులు నాగెళ్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు.KCHP లో వెలువడే దుమ్ము ధూళితోనే కార్మికులు ఓ పక్క సతమతమవుతుంటే,మరో పక్క ఫైర్ కోల్ ద్వారా వెలువడే పొగతో కార్మికులు పనులు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దమ్ము,ధూళితో పాటు ఫైర్ కోల్ ద్వారా వెలువడే పొగ పీల్చడం వల్ల కార్మికులు శ్వాసకోశ వ్యాధులకు గురై,నిమ్ము,ఆయాసంతో ఊపిరితిత్తులు దెబ్బతిని గుండె జబ్బుల బారిన పడి విలువైన ప్రాణాలను పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఆయన వాపోయారు.కార్మిక ప్రయోజనాలను కాపాడతామని కార్మిక ఓట్ల ద్వారా గెలిచిన కార్మిక సంఘాలు నేడు యాజమాన్యం చేతిలో కీలు బొమ్మలుగా మారి సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.కార్మిక ఆరోగ్య శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పే యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆరోపించారు.ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి ఫైర్ కోల్ ద్వారా వెలువడే దట్టమైన పొగ వెలువడ కుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టి కార్మిక ప్రాణాలకు అండగా నిలవాలని ఆయన కోరారు.