నేటి గదర్, ఆగస్టు 2, బూర్గంపాడు :
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్సై నాగ బిక్షం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఐటీసీ ఎంఎస్కే, ప్రథమ్ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం నందు గురువారం బూర్గం పహాడ్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అదనపు ఎస్ఐ నాగబిక్షం మాట్లాడుతూ… మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే నష్టాలను, వీటి వలన వచ్చే అనర్ధాలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు, లైసెన్స్ లేకుండా ఎవరూ ఎటువంటి మోటారు వాహనాన్ని నడపడానికి అనుమతి లేదని చెప్పారు. పరిసరాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు గమనించినట్లయితే 100కు డయల్ చేయడం, లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ సత్యం, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఐటీసీ ఎంఎస్కే ప్రథమ్ వొకేషనల్ సెంటర్ భద్రాచలం క్లస్టర్ హెడ్ నరేష్కుమార్, ఉపాధ్యాయులు, ఎలక్ట్రికల్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.