*రూ.2లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం
* ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి చూపిస్తాం
* వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
దేశచరిత్రలోనే తొలిసారి రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేల కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.
‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ప్రజాప్రభుత్వం అజెండాలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఉందని, ఒకవైపు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, మరోవైపు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
”ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈరోజే జాతికి అంకితం చేసుకున్నాం. ఏడాది తిరిగేలోపే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది” అని ముఖ్యమంత్రి తెలిపారు.
అటు ప్రాజెక్టుల నిర్మాణం, ఇటు రుణమాఫీ ప్రక్రియతో తెలంగాణ రైతన్నల ఇంట పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తే వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని, ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అసాధ్యం అని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామన్న ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు.
సాగుకు జీవం – రైతుకు ఊతం బహిరంగ సభలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పలువురు ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.