చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా విభజిస్తూ ఉభయ సభల్లో ఆమోదం తెలపడం రాజ్యాంగాన్ని అవమానించడంగానే తాము భావిస్తున్నామని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, జిల్లా కోకన్వీనర్ ఏడెల్లి గణపతి అన్నారు.ఎస్సీలను మూడు భాగాలుగా విభజిస్తూ జస్టిస్ షమీమ్ ఆక్తర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి వర్గీకరణ అమలుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుమేరకు మాల మహానాడు మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద చర్ల భద్రాచలం ప్రధాన రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను మాల మహానాడు నాయకులు దహనం చేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా కన్వీనర్ తోటమల్ల రమణమూర్తి, కో కన్వీనర్ ఏడెల్లి గణపతి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానంగా చేసుకొని కమిషన్ నియమించడమే కాక, కమిషన్ ఇచ్చిన నివేదికను ఉభయ సభల ద్వారా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ కు మాత్రమే చట్ట సవరణ చేసే అధికారం ఉన్నా అవేమీ పట్టనట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.2011 జనాభా ప్రాతిపదికన మాలలు 6 శాతం ఉంటే 13 సంవత్సరాల అనంతరం 2025 వ సంవత్సరంలో మాలలు ఐదు శాతం ఎలా తగ్గిపోతారని, రోజురోజుకు జనాభా పెరుగుతుంటే మాలల శాతం తగ్గిందంటూ గణాంకాలు తెలపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉభయసభల్లో ఆమోదించిన వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీల రిజర్వేషన్ ను 20 శాతానికి పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ బోళ్ల వినోద్, భద్రాచలం డివిజన్ నాయకులు తోటమల్ల కృష్ణారావు, కొంగూరు సత్యనారాయణ,కుప్పాల నిరంజన్, కొంగూరు ప్రదీప్, మంచాల రవీందర్, చింతల శ్రీను, సిద్ధి రమేష్, చింతల నాగేంద్ర, మేడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.