టియుసిఐ జిల్లా అధ్యక్షులు అర్. మధుసూదన్ రెడ్డి. మణుగూరు ఏరియా కార్యదర్శి బి. మల్సూర్
ఈనెల 16న కొత్తగూడెంలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, మణుగూరు ఏరియా కార్యదర్శి బి. మల్సూర్ కార్మికులను కోరారు. ఆదివారం స్థానిక టియుసిఐ కార్యాలయంలో ఏరియా అధ్యక్షులు జెల్ల. అశోక్ అధ్యక్షతన జరిగిన మణుగూరు ఏరియా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నదని, దానిలో భాగంగానే ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్తతర్పణ చేసి సాధించుకున్న 44 చట్టాలను సవరించి, నాలుగు కోడ్ లుగా విభజించి సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, 8 గంటల పని దినం లాంటి తదితర హక్కులను కాలరాయడానికి పూనుకున్నదని, ఇది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టకరమైన చర్య అని, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో 44 కోట్ల మంది కార్మికులు ఉంటే జీవన భద్రత కలిగిన సంఘటిత కార్మికులు కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే ఉన్నారు అన్నారు. మిగతా కోట్ల మంది కార్మిక వర్గం హక్కులు లేని కనీస వేతనం లేని ఉద్యోగ, సామాజిక భద్రత లేని అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారన్నారు. అసంఘటిత రంగ కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. టి యు సి ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల ఐక్యం చేసే కృషి కొనసాగుతుందన్నారు. జిల్లాలో సింగరేణి, మున్సిపల్, విద్యుత్తు, గ్రామపంచాయతీ, మోటార్, హమాలీ, కేజీబీవీ, ప్రభుత్వ హాస్పటల్ వర్కర్స్ తదితర రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం టి యు సి ఐ తమ వంతు బాధ్యతగా పోరాడుతుందన్నారు. ఈ నేపథ్యంలో గత కార్యక్రమాలను, పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను, పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ నెల 16న కొత్తగూడెంలో టి యు సి ఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ మహాసభలో మణుగూరు ఏరియాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏరియా కమిటీ సభ్యులు బత్తుల. వెంకటేశ్వర్లు, మిట్టపల్లి. రాజేందర్, వి. జానయ్య, ఆర్. బిక్షం, జే. యాకయ్య, ఎం. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.