తెలంగాణ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించేందుకు సాయం అందిస్తన్నారు. జనవరి 26 పథకం లాంఛనంగా ప్రారంభం కాగా.. తెలంగాణ వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను రెడీ చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామగ్రి , ఇతర అనుమానాలను లబ్ధిదారులకు వివరించనున్నారు.
*ఇందిరమ్మ ఇండ్లకు నిబంధనలు ఇవే..*
ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత జాగా చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే స్వయంగా ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది.
ముందు చెప్పిన జాగాలో కాకుండా మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.
ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు.
ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉండదు.
పునాది పూర్తయిన తర్వాతే తొలి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.
ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో లేదా ఆర్డీవో ద్వారా అందించనున్నారు.
సిమెంటు, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు.
క్షేత్రస్థాయిలో ఏఈ లేదా ఎంపీడీవోలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిఫార్సు చేస్తారు.
కాగా, ప్రభుత్వం తొలి విడతలో 71,482 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇండ్లు ఇవ్వనుంది.
ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3500 చొప్పున మెుత్తం 4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పగా.. మిగతా ఇండ్లను త్వరలోనే మంజూరు చేయనున్నారు.
మెుత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయనుంది