ఖమ్మం జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు …..
నేటి గద్దర్ న్యూస్, చింతకాని మండల ప్రతినిధి, గుడిద పిచ్చయ్య.
ఖమ్మం జిల్లా చింతకాని లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముగ్గురిపై కేసు..
పరారీలో ప్రధాన నిందితుడు చారి.
సంచార వాహనాన్నే లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకుని ఊరూరా తిరుగుతూ అనైతిక కార్యకలాపాలకు తెగబడుతున్న ముగ్గురిపై ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగర పరిధిలోని ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్కు చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేసారు . నగర శివారు బల్లేపల్లికి చెందిన ఆర్‌ఎంపీ చారి, డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ రాచబంటి మనోజ్ సొంత ఊరు కొదుమూరు,వారి వద్దకు వచ్చే రోగులను ఈమె పనిచేసే ఆసుపత్రికి రిఫర్ చేసేవారు..
ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్రమార్జనకు సిద్ధపడ్డ చారి ఆధ్వర్యంలో వీరు ఏడాది క్రితం ఓ కారు కొనుగోలు చేశారు. అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామగ్రిని అమర్చుకున్నారు. ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్తూ గర్భంతో ఉన్న అమాయక గిరిజన మహిళలకు అందులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు.
అక్కడ పరీక్షలు చేయించుకునేందుకు ఇష్టపడని వారిని బల్లేపల్లి, కొదుమూరులోని సొంత గ్రామానికి తీసుకొచ్చేవారు. గర్భవిచ్ఛిత్తి కోసం ఇల్లెందులో ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు పంపుతుండేవారు.ఈ విషయంపై చింతకాని పోలీస్ విభాగం వారు నిఘా పెట్టగా నిందుతులలో ఇద్దరు దొరికారు. అయితే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అయినా చారి ఆచూకీ తెలిస్తేనే ఆ ఇల్లందు వైద్యుడెవరన్నది తేలే అవకాశమున్నట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 నెలలుగా వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచారు. గురువారం నలుగురు మహిళల్ని కొదుమూరుకు తీసుకొచ్చిన క్రమంలో నిందితులు మనోజ్, కాత్యాయనిలను విచారించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ప్రధాని నిందుతుడు చారి కోసం పోలీస్ లు గాలిస్తున్నారు.









