సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.
వాగులపై హై లేవల్ వంతెనలు నిర్మించాలి
కాలువల సైడ్ వాల్స్ నిర్మాణంలో లోపాలపై విచారణ జరపాలి.
స్థానిక సమస్యల పరిష్కారానికి సిపిఐ(ఎం) కృషి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గంలో అకాల వర్షాల ప్రభావంతో వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పెసర, పత్తి, వరి రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్రమయ్యాయని, మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చేంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, సీజనల్ వ్యాదులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వైద్య శిబిరాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని కోరారు. పల్లిపాడు – ఏన్కూర్ రహదారిలోని లాలాపురం – తీగల బంజర – అంజనాపురం – జన్నారం గ్రామాల మధ్య వాగులపై హై లెవెల్ వంతెనలు లేకపోవడంతో రాకపోకలు స్తంభించి పోతున్నాయని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, వైరా రిజర్వాయర్ కాలువల సైడ్ వాల్స్ నిర్మణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని, వరదలతో విప్పలమడక – లింగన్నపాలెం మధ్య సైడ్ వాల్ కూలిపోయిందని ఆరోపించారు. కోట్ల రూపాయలతో మంజూరైన కాల్వల ఆధునీకరణ
పనుల్లో జరిగిన లోపాలపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డుల్లో వర్షపు నీరు నిల్వ ఉండి, సైడ్ డ్రైనేజీలు పనిచేయకపోవడం, వీధి లైట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలను సిపిఐ(ఎం) సర్వేలో గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమగ్ర కృషి చేయాలని, ఇప్పటికే సిపిఐ(ఎం) ప్రజా సమస్యలపై కృషి చేస్తుందని, ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న రోడ్లను ఆర్&బి అధికారులు వెంటనే మరమ్మతు చేయాలని ఆయన కోరారు.









