పర్యటకుల అవసరాలు, బోటింగ్, వసతుల కల్పనలకు చర్యలు.
మత్స్యకారుల జీవనోపాధికి చేపలు అందించేందుకు చర్యలు చేపట్టాలి.
నేటి గదర్ న్యూస్, వైరా:
పర్యాటక ప్రాంతాలలో మౌళిక వసతుల ఏర్పాటుతో, పర్యాటకంలో జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.బుధవారం వైరా కేంద్రంలోని రిజర్వాయర్ పర్యాటక ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతం గుట్టలను, బోటింగ్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. కావాల్సిన మౌళిక వసతుల ఏర్పాటు గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనకట్ట సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం మత్స్య విత్తన క్షేత్రం ను కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్స్య శాఖ విత్తన కేంద్రంలో మౌళిక వసతులను పరిశీలించారు. మత్స్యశాఖ విత్తన కేంద్రంలో పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.బోటింగ్, కాటేజ్ గదులు, బిల్డింగ్ మరమ్మత్తులకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడం కోసం జిల్లాకు సంబంధించి మత్స్యకార సహకార సంఘాలు, వేల మంది సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా చెరువులలో చేప పిల్లలు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట మత్స్య శాఖ ఎడీ శివప్రసాద్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, వైరా తహసిల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వేణు, అధికారులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.









