దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. పోడు భూములపై అటవీ అధికారుల చర్యలు ఖండించిన సంఘం.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 18: రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియాను ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలని, పోడు భూముల్లో అటవీ అధికారులు పంటలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎఐయుకెఎస్) ఆధ్వర్యంలో దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు రాత్రింబవళ్లు సహకార కార్యాలయాల ముందు ఎదురుచూస్తున్నా యూరియా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే యూరియాను అందించాలి, పత్తిపై ఎత్తివేసిన 11% సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి, పత్తికి కనీస మద్దతు ధర రూ. 10,075గా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోడు భూముల్లో రైతులు పండించిన పంటలను అటవీ అధికారులతో ధ్వంసం చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అతివృష్టి కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలి, వృద్ధాప్య పింఛన్లను రూ. 4,000, వికలాంగుల పింఛన్లను రూ. 6,000 కు పెంచుతామన్న ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు పండూరి వీరబాబు, డివిజన్ నాయకులు వగ్గేల ప్రసాద్, మండల అధ్యక్షులు కుంజా కాంతారావు, తామ రాముడు, కుంజ పాపారావు, బండి ఆదినారాయణ, చాప ముత్యాలరావు, కేసరి వెంకటేష్, గంగాధర నాగమణి, తెల్లం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.









