నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా త్రీ ఫేస్ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గ్రామంలోని తాగునీటి మోటారు పనిచేయడం లేదు. ఫలితంగా నీరు లేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో ఒక నీటి ట్యాంకు ఉన్నప్పటికీ, అది దిగువ ప్రాంతంలో ఉండటంతో దానిని ఉపయోగించడం లేదు. పై భాగంలో ఉన్న మోటారు ద్వారా నల్ల పైపులకు నీరు సరఫరా చేస్తారు. అయితే, ఈ మోటారు నడవడానికి త్రీ ఫేస్ కరెంట్ తప్పనిసరి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మోటారు ఆగిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, తన సొంత ట్రాక్టర్‌తో పక్క గ్రామం నుండి కొంత మేరకు నీటిని తెచ్చి గ్రామస్తులకు అందించారు. అయినప్పటికీ, ఇది తాత్కాలిక పరిష్కారమేనని, విద్యుత్ శాఖ ఈ సమస్యపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.









