చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో పోలీసు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి(వికల్ప్), కడారి సత్యనారాయణరెడ్డి (కోసా) మృతి చెందారు. సాయుధ పోరాట విరమణ అంటూ మావోయిస్టు పార్టీ చుట్టూ జరుగుతున్న చర్చకు చెక్ పెట్టడంపై కేంద్ర కమిటీ ఫోకస్ పెట్టిన సమయంలో ఇద్దరు అగ్ర నేతలు ఎన్‌కౌంటర్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాము ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తాజాగా మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను (అభయ్ పేరుతో) చేసిన ప్రకటనను ఖండిస్తూ ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సెప్టెంబర్ 20వ తేదీన ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించి, ఆయుధాలు త్యజించడమంటే శత్రువు ముందు లొంగిపోవడమే అని, అది విప్లవానికి ద్రోహం చేయడమే అవుతుందని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ ప్రకటన మీడియాకు చేరేలోపే పోలీసు కాల్పుల్లో వికల్ప్ మృతి చెందడం ఇప్పుడు విప్లవాభిమానులు, పార్టీ శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
సిద్ధిపేట జిల్లా, కొహెడ మండలం, తీగలకుంటపల్లికి చెందిన
కట్ట రామచంద్రారెడ్డి @ వికల్ప్ @ రాజు దాదా @ విజయ్ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కట్ట రామచంద్రారెడ్డితో పాటు ఎన్ కౌంటర్‌లో చనిపోయిన కడారి సత్యనారాయణ రెడ్డి @ కోస @ గోపన్న @ బుచ్చన్న @ సాదు విద్యార్థి ఉద్యమం నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన సత్యనారాయణ పెద్దపల్లిలో ఐటీఐ చేసే సమయంలో రాడికల్ విద్యార్థి సంఘంలో క్రియాశీలంగా పనిచేసేవాడు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అట్టడుగు ప్రజలతో మమేకమైన సత్యనారాయణ రెడ్డి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న కోస మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సెంట్రల్ రీజనల్ బ్యూరోలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా దండకారణ్యంపై ముప్పేట దాడి చేస్తోంది. లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను మోహరించి దాడులు జరుపుతోంది. అగ్ర నాయకత్వం టార్గెట్ గా సాగుతున్న ఈ దాడుల్లో పోలీసు బలగాలు పైచేయి సాధించడం వెనక కోవర్టుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.









