ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం, సంక్షేమ పథకాల పంపిణీలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 24: రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఆత్మ కమిటీ’ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగాలేకపోయినా, పేదలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రతి సోమవారం జమ చేస్తామని చెప్పారు. ఈ చర్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు ప్రతిబింబమని, పేదలు ఎక్కడా తలదించుకోకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఆత్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అశ్వారావుపేటలో 966 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, అలాగే 19 మంది కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ. 19,02,204 విలువైన చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే మొదటిసారిగా అశ్వారావుపేటలో జరగడం సంతోషకరమని అన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. రైతులు, ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆత్మ కమిటీ సభ్యులు వ్యవసాయ సంబంధిత సబ్సిడీ పథకాల అమలులో పారదర్శకతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









