కేటీఆర్ పిలుపుతో హైదరాబాద్ బస్‌భవన్ ముట్టడికి యత్నం –ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 09: ప్రభుత్వం ఇటీవల పెంచిన బస్సు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బస్‌భవన్ ముట్టడికి వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మండల నాయకులు గురువారం ఉదయం హైదరాబాద్ బయలుదేరడానికి సన్నాహాలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించారని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో ముఖ్యంగా మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జిల్లా అధికార ప్రతి నిధి యూఎస్ ప్రకాష్ రావు, అశ్వారావుపేట టౌన్ ప్రసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, ఆరేపల్లి గోవింద్ మరికొంత మంది కార్యకర్తలు ఉన్నారు. బస్సు ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అరెస్ట్ అయిన నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు తమను ముందస్తుగా అరెస్ట్ చేసి, నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని వారు స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉంచి, తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని, ఈ అరెస్టులు తమ ఉద్యమాన్ని ఆపలేవని నాయకులు స్పష్టం చేశారు.









