గురుకుల విద్యార్థినుల ఆచూకీ లభ్యం: “చదువుపై ఆసక్తి లేకే వెళ్లాం” అంటున్న బాలికలు
దమ్మపేట గురుకుల కళాశాల నుండి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులు ఖమ్మం బస్టాండ్‌లో గుర్తింపు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 13: దమ్మపేట మండలం, అంకంపాలెం గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల నుండి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. ఈ బాలికలు ఖమ్మం బస్టాండ్ వద్ద కనిపించడంతో సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిద్దరినీ తమ పర్యవేక్షణలోకి తీసుకున్నారు. విద్యార్థినులను సురక్షితంగా దమ్మపేటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల విచారణలో విద్యార్థినులు వారి అదృశ్యానికి గల కారణాలను వెల్లడించారు. తమకు చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకపోవడం వల్లే కళాశాల నుండి స్వయంగా బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.









