బీసీల 42% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా అమలు చేస్తాం -ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
హైకోర్టు స్టే నేపథ్యంలో బీసీ బంద్ -అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లిలో ఎమ్మెల్యే ఆదినారాయణ ర్యాలీలో భరోసా
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 18: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల జారీ చేసిన జీవో నెం. 9పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీసీ బంద్ కు పిలుపునిచ్చిన తరుణంలో వివిధ మండల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండల కేంద్రాలలో బీసీ సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమాలు, ర్యాలీలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బీసీలకు పూర్తి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు హక్కుగా లభించాల్సిన 42% రిజర్వేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కల్పించి వారికి న్యాయం చేయాలని చూస్తున్న సందర్భంలో కొందరు వ్యక్తులు హైకోర్టు ద్వారా స్టే విధించడం అత్యంత బాధాకరం. ప్రభుత్వ చిత్తశుద్ధిని అణిచివేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ పట్టుదలను స్పష్టం చేస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కట్టుబడి ఉంది. బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టులో పోరాడి తీరుతాం. బీసీలకు 42% రిజర్వేషన్లు అందించే వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుంది. చారిత్రక కులగణన డేటా, డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది పక్కా శాస్త్రీయమైనది. ఈ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించని సుప్రీంకోర్టు, ముందుగా హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని సూచించింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు పునరుద్ఘాటిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది.









