ఎస్టీ మహిళను బెదిరించి రూ. 20 వేలు వసూలు చేసిన కేసులో పెనుగొండ సత్యనారాయణ అదుపులోకి – అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ఎస్టీ మహిళను మోసగించిన కేసులో పోలీసులు చురుగ్గా స్పందించారు. కొట్టివేసిన కేసు పేరు చెప్పి మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురం కాలనీకి చెందిన పట్టేల మంగ (50, ఎస్టీ) ఫిర్యాదు మేరకు నిందితులు పెనుగొండ సత్యనారాయణ మరియు జక్కుల రాంబాబులపై కేసు నమోదు చేశారు. కొడుకు కేసు మళ్లీ వచ్చిందని బెదిరించి, ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న రూ. 20,000ను వారు వసూలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆ ఇద్దరు విలేకరులని నిరూపణ అయ్యింది. నిందితుల్లో ఒకరైన పెనుగొండ సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము అని ఎస్సై తెలిపారు. రెండో నిందితుడు స్థానిక వ్యక్తి అయిన జక్కుల రాంబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాము. త్వరలో జక్కుల రాంబాబును కూడా అరెస్టు చేస్తాము అని ఎస్సై యయాతిరాజు పేర్కొన్నారు.









