శిధిలావస్థలో ఉన్న బిల్డింగ్ తొలగించి నూతనంగా తరగతి గదులు నిర్మించాలి.
లైబ్రరీ మంజూరు చేయాలి, మరుగుదొడ్లు నిర్మించాలి.
పిడి పోస్ట్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.
బాలబాలికలకు ఎస్ఎం హాస్టల్ సొంత భవనం మంజూరు చేయాలి …
వైరాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి..
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరిన సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
జూనియర్ కళాశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్న సిపిఎం బృందం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం సిపిఐ(ఎం) బృందం సందర్శించి కళాశాల ఆవరణమంతా పర్యటించి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతితో పాటు విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి జూనియర్ కళాశాలలో ఉన్న మౌళిక సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని, తగిన స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావులు విజ్ఞప్తి చేశారు. కళాశాల పాత భవనం తొలగించి పూర్తిస్థాయిలో తరగతి గదులతో నూతన భవనం నిర్మించాలని కోరారు. ఇప్పటికే మూడున్నర కోట్ల రూపాయలతో అంచనాలను ఇంజనీరింగ్ అధికారులు వేశారని, రాష్ట్ర ప్రభుత్వం అట్టి నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలకు అదనపు గదుల కోసం ఆనాటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 25 లక్షలు మంజూరు చేసి బిల్డింగ్ పనులు ప్రారంభమైనా నిధులను ప్రభుత్వం, ఆర్థిక శాఖ విడుదల చేయకపోవడంతో అసంపూర్తిగా మిగిలి ఉందని, వెంటనే అట్టి నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు, బాల, బాలికలకు సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ సౌకర్యం లేక విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి రోజు కళాశాలకు రావటం ఇబ్బందిగా ఉందని వెంటనే సొంత భవనం నిర్మించాలని కోరారు, లైబ్రరీ సౌకర్యం లేక రోజు వారి విజ్ఞానం విద్యార్థులకు అందుబాటులో లేదని వెంటనే లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు, పిడి పోస్ట్ లేక ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు లేక ఇబ్బందులకు పడుతున్నామని విద్యార్థులు తమ బృందం దృష్టికి తీసుకొచ్చారని ప్రభుత్వం వెంటనే పిడి పోస్ట్ భర్తీ చేసి ఆటల సంబంధించిన వస్తువులు ఇవ్వాలని కోరారు, కళాశాలలో బాలురులకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తగిన స్థాయిలో మరుగుదొడ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరారు, విద్యార్థులకు మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ అందటం లేదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, జూనియర్ కళాశాల అభివృద్ధికి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు మరియు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఎం కోరుతుందని వీరభద్రం తెలిపారు. జూనియర్ కళాశాల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. జూనియర్ కళాశాల సందర్శించిన బృందంలో సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పట్టణ నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, అమరనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.









