“కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది” – మెచ్చా నాగేశ్వరరావు ధ్వజం.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్యాన్ని, పార్టీ కార్యకర్తల భద్రతను ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాడుతుంటే తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు గుండాలుగా మారి పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి నీచ పరిస్థితులు చూడలేదని, కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన రెండేళ్లలోనే రాష్ట్రం మొత్తం రౌడీ రాజ్యం నడుపుతోందని, సామాన్య ప్రజలు సైతం భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు లేదా కార్యకర్తలు ఆఫీస్‌లో ఉండి ఉంటే వారిని హత్య చేసేవారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే, వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాని హెచ్చరించారు.









