ఘనంగా డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు డిమాండ్
నేటి గదర్ న్యూస్, వైరా:-
ప్రజాస్వామ్య యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని వైరా పట్టణ పరిధిలోని లాలాపురం గ్రామంలో వేము చిన్నబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొడ్డు మధు ముఖ్య వక్తగా ప్రసంగిస్తూ 1980 నవంబర్ 1, 2, 3 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో ఏర్పడిన డివైఎఫ్ఐ సంఘం దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ, పోరాటాలు నిర్వహిస్తున్న అతిపెద్ద యువజన సంఘంగా పనిచేస్తుందని తెలిపారు. నేటి యువత డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ కు దూరంగా ఉండి, సమాజ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న ప్రతి యువతీ యువకులకు తక్షణమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని, తక్షణమే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని, ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. భవిష్యత్తులో యువజనులు తమ హక్కులను సాధించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వేము చిన్నబాబు, వేము శ్రీను, బందెల కృష్ణ, తెల్లూరి కిరణ్, బాలమర్తి కోటేశ్వరావు, వేము వంశీ, బందెల సాయి, కోపిల విమలరాజు, కోపిలా వెంకటేష్, బందెల సాయిరాం, సంక్రాతి వినయ్, కాశిమళ్ళ రవికుమార్, తెళ్లూరి ప్రవీణ్, సపావత్ నర్సింహారావు, తెళ్లూరి మురళి, తెళ్లూరి కార్తీక్, తెళ్లూరి రోషి, నిఖిల్, సంక్రాతి విప్లవ్, అనుమోలు నర్సింహారావు, సంక్రాతి గిరి, నాగ, షేక్ సులేమాన్, అనుమోలు రామారావు, సంక్రాంతి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.









