అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో గత రెండు, మూడు సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న నిరుపేదలు నివసిస్తున్న రేకుల షెడ్లు, పాకలను సోమవారం తెల్లవారుజామున కూల్చివేయడం పట్ల భారత్ రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు ఉంటున్న నివాసాలను దుర్మార్గంగా కూల్చివేయడాన్ని అశ్వారావుపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్న బాబు తీవ్రంగా ఖండించారు. ఇక్కడ జీవిస్తున్న వారంతా రోజువారీ కూలి, చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకునేవారే అని ఆయన గుర్తుచేశారు. కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన ఈ కుటుంబాల కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి ఇళ్ల స్థలాలను కేటాయించి, వెంటనే ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు వెంకన్న బాబు వెల్లడించారు. పేద ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.









