అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో నిరుపేదలు అనధికారికంగా నిర్మించుకున్న గృహాలను రెవెన్యూ అధికారులు సోమవారం తెల్లవారుజామున కూల్చివేశారు. సుమారు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్న 150కు పైగా కుటుంబాల తాత్కాలిక నివాసాలను జేసీబీల సహాయంతో అధికారులు నేలమట్టం చేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, పాల్వంచ డీఎస్పీ పర్యవేక్షణలో వందలాది పోలీసులు మోహరించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఈ తొలగింపు చర్యలను పటిష్ట బందోబస్తు మధ్య సమర్థవంతంగా చేపట్టాయి. గత నెల అక్టోబర్ 16న ఆక్రమణదారులకు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించాలంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ, నివాసితులు స్పందించకపోవడంతో అధికారులు కూల్చివేతకు పూనుకున్నారు. ఈ తొలగింపు డ్రైవ్ మొత్తం సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై చేపట్టగా, ఇది యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం క్లియరెన్స్ చర్యగా భావిస్తున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “సొంతిల్లు కోసం అప్పులు చేసి రేకుల షెడ్లు కట్టుకుంటే, ఇప్పుడు ఒకింత దిక్కుతోచని స్థితిలో ఉన్నామని” బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, భూమి ఆక్రమణకు నిరుపేదలను ప్రేరేపించినట్లు ఆరోపణలున్న సీపీఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టుల కారణంగా ఉద్రిక్తతకు తావులేకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.









