రోడ్డుపై డ్రైనేజీ నీరు -అశ్వారావుపేటలో బురదమయం
షాపుల యజమానులు, పాదచారుల తీవ్ర ఇబ్బందులు; పట్టించుకోని మున్సిపల్ అధికారులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) నవంబర్, 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో ఇటీవల డ్రైనేజీలు నిర్మించినప్పటికీ, ఆ నీరు డ్రైనేజీలోకి వెళ్లే మార్గం సరిగా లేకపోవడం వలన నీళ్లన్నీ రోడ్లమీద షాపుల ముందు నిలిచిపోతున్నాయి. దీంతో షాపుల యజమానులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నడవడానికి పాదచారులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బురద కారణంగా ఎవరైనా షాపుల్లోనికి రావాలంటే వెనుకాడుతున్నారు, దీనివల్ల వ్యాపారం దెబ్బతింటోందని దుకాణదారులు వాపోతున్నారు. ఇన్ని రోజులు దుమ్ము, ధూళితో బాధపడుతుంటే ఇప్పుడు కొత్తగా ఈ బురద సమస్య ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి, డ్రైనేజీ నీళ్లు రోడ్డుపైకి రాకుండా చూడాలని, అలాగే పగిలిపోయిన పైపుకు మరమ్మతులు చేసి నీళ్లు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని షాపుల యజమానులు కోరుతున్నారు.









