పేదల ఇళ్ల కూల్చివేతపై సిపిఐ నిరసన భగ్గు: ఉద్యమంగా మారే సూచన
అశ్వరావుపేటలో భూస్వాముల ఆక్రమణలోని ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజుకు చేరిన దీక్ష
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) సర్వే నెంబర్ 1228లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ సీపీఐ అశ్వరావుపేట మండల సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం తో నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. అర్ధరాత్రి తమ ఇళ్లను కూల్చివేయడం పట్ల ప్రజలు ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి, నష్టపోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపించి, న్యాయం చేయకపోతే ఈ నిరసన దీక్ష ప్రజా ఉద్యమంగా మారుతుందని సీపీఐ శ్రేణులు, ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనకు మద్దతుగా ప్రజా నాట్యమండలి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, గిరిజన సంఘం నాయకులు వాసం పోలయ్య మాట్లాడుతూ పేదల ఇళ్లను కూల్చివేయడం రాక్షస చర్య అని తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని భూస్వాములకు ఏ విధంగా కట్టబెట్టారో అధికారులు సమాధానం చెప్పాలని, పేద బలహీన వర్గాల ప్రజల గుడిసెలను కూల్చడం సరైంది కాదని ఆయన అన్నారు. భూస్వాములకు కట్టబెట్టిన ప్రభుత్వ భూములపై సమాధానం చెప్పకపోతే ఈ ఉద్యమంలో సీపీఐతో కలిసి పోరాటం చేస్తామని వాసం పోలయ్య తెలిపారు. ఈ నిరసనలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, నష్టపోయిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









