సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు మీడియా సమావేశం
హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్, యూనివర్సిటీల సదస్సు లాంటి పలు కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హమీల అమలుపై దృష్టి కేంద్రీకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు సూచించారు. అధికారంలోనికి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఇక ప్రజలు కూడా అడుగుతారని, అందుకే హామీలపైన దృష్టి పెట్టాలన్నారు. దేశంలో ఒక మాయా ప్రభుత్వం నడుస్తోందని, రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, దేశ స్వాతంత్య్రం, మహానుబావులు అంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఒక మిద్యే అని విమర్శించారు. జల వివాదాల అంశంలో అధికార, ప్రధానిప్రతిపక్ష బిఆర్ పరస్పరం మాటలు అనుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి సమిష్టిగా కేంద్రం, ఎపి సిఎం చంద్రబాబుపైన పోరాడాలని సూచించారు. సిపిఐ రాష్ట కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, ఈ.టి.నర్సింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నర్సింహతో కలిసి కూనంనేసి సాంబశివరావు హైదరాబాద్ మఖ్ధూంభవన్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపంపిణీ, ఉచిత బస్సు లాంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, కానీ ఇంకా ఇవ్వాల్సిన మహిళా లక్ష్మి రూ. 2500లు,రూ.4వేల పెన్షన్, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లాంటి హామీలను కూడా అమలు చేయాలని సూచించారు. కెసిఆర్ భిన్నమైన పాలన అని రేవంత్ రెడ్డి రుజువు చేసుకోవాల్సి ఉందన్నారు. పంచాయతీలు, మున్సిపల్ శాఖలో అవుట్ సో ర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తగ్గిస్తున్నారని, చిన్న ఉద్యోగులకు బకాయిలు పేరుకుపోతున్నాయని, అవుట్ సోర్సింగ్ పేరుతో కార్మికులు, ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నారన్నారు.
స్నేహ పార్టీలను కలుపుకుంటే మంచిది
సాధ్యమైనంత వరకు స్నేహ పార్టీలను కలుపుకుంటే మంచిదని, పార్టీ గుర్తులతో జరిగే ఎంపిటిసి, జెడ్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తరహా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి సూచించారు. స్నేహితులకు మద్దతు ఇవ్వాలని, తమ ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వకపోతే ఎలా అని అని అన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతు లేకపోగా, తమకు, కాంగ్రెస్ పోటీ జరిగిందన్నారు. కమ్యూనిస్టులు ఏంది అని అనుకున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ దెబ్బ తిన్నదని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సిపిఐకి మంచి ఫలితాలు వచ్చాయని, ప్రజలు తమపైన విశ్వాసంతతో 94 మంది సర్పంచ్ 104 ఉప సర్పంచ్ 1015 వార్డులలో సిపిఐ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారని ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
జనవరి 18న ఖమ్మంలో సిపిఐ వందేళ్ల వేడుకలు
ఖమ్మం జిల్లాల్లో ‘డిసెంబర్ 26న’ జరగాల్సిన సిపిఐ వందేళ్ల ఉత్సవాలను అనివార్య కారణాలతో జనవరి 18న నిర్వహిస్తున్నామని, ఈ సభను ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్నామని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. జనవరి 18,19,20,21 జరగాల్సిన వేడుకలలో జాతీయ సెమినర్, కౌన్సిల్ సమావేశం జరుగుతుందని, విదేశాల నుంచి ప్రతినిధులు,ఇతర వామపక్ష పార్టీల నాయకులు హాజరుకానున్నారన్నారు. ఈ సమావేశాలకు సౌహౌర్ద సందేశం నిమ్మితం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని కూనంనేని తెలిపారు.
నీటి వివాదాలను రాజకీయంగా చూస్తే తెలంగాణకు నష్టం :
నీటి వివాదాలపైన దృష్టి మళ్లించే రాజకీయాలతో ప్రజలకు ఉపయోగం లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. శాసనసభలో జరిగే చర్చలో నీటి వివాదాల అంశంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని, అలాగే కెసిఆర్ కూడా ఏం చేస్తే బాగుంటుందో , ఎక్కడ పొరపాట్లు జరిగాయో చెబితే మంచిదని సూచించారు. నీటి వివాదాలను రాజకీయ అంశంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికే నష్టమన్నారు. అసలు రెండేళ్లు కెసిఆర్ ఇంట్లో ఉండడమే తప్పు అని, అన్ని సవ్యంగా ఉంటేనే వస్తారా? ప్రజల తీర్పును గౌరవించబోరా? అని కూనంనేని ప్రశ్నించారు. ఇప్పటికే కెసిఆర్ తన విలువైన సమాయాన్ని వృధా చేసుకున్నారని, ఈ పాటికే ఆయన తన విలువైన సూచనలు ఇస్తే, ప్రభుత్వం కూడా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కదా అని అన్నారు. గాదె ఇన్నయ్య అరెస్ట్ కూనంనేని ఖండించారు.
కేంద్రం తెచ్చిన ‘శాంతి’తో భారతదేశానికి ‘అశాంతి’
భారతదేశ శత్రువులు అనుఇందన వ్యాపారం రూపంలో వచ్చి భారత దేశాన్ని ముక్కుల ముక్కలు చేస్తే ఎవరు బాధ్యులని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అను విద్యుత్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం అవకాశం కల్పిస్తూ ప్రవేశపెట్టిన ‘శాంతి’ బిల్లు భారతదేశానికి అశాంతి లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ డి ఐ వంద శాంత పెట్టుబడులకు అవకాశం కల్పించడంతో ఎల్ ఐ సి లాంటి సంస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఇతర దేశాల తరహా భారతదేశంలో కూడా ప్రభుత్వాలు మారితే ప్రధానిమోదీకి ఉరిశిక్ష వేసే వారని అన్నారు. ప్రజల సొమ్మును విక్రయించేందుకు మోదీ ఎవరు? అని నిలదీశారు. దేశ భక్తునిగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం దేశ భక్తులా? లేదా దేశ ప్రజలను భక్షించే రాక్షస భక్తులా? అని కూనంనేని నిలదీశారు. ఇలాంటి ప్రభుత్వానికి జగన్ , చంద్రబాబు లాంటి వారు మద్దతు ఇస్తున్నారన్నారు. గ్రామీణా ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీపేరును తొలగించడం మూర్ఖత్వమన్నారు. దేవుడిని దేవుడిగానే, చరిత్రను చరిత్రగానే చూసుకోవాలని, దేశం కోసం పోరాడిన వారిని విస్మరిస్తే అంతకంటే అదోగతి, చరిత్రహీనత మరోటి ఉండబోదన్నారు. మహానుభావులను, మహాత్ములను అవమానించినందుకు ప్రధాని మోదీపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలతో సక్రమమైన పాలన అనిపించుకోదని, ఇదొక దుర్మార్గమైన, శాడిస్టు , రాక్షస పాలన అని దుయ్యబట్టారు. ‘వి బి జి రామ్ పేరుతో గ్రామీణ ఉపాధి పథకం పూర్తి స్వరూపాన్ని మార్చారని, నిధులను తగ్గించారని, లక్ష్యాన్ని కూడా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుందని,అందుకు అనుగుణంగానే మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.









