యువ చైతన్య సైకిల్ యాత్రను అభినందించిన ఎస్ఐ
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పుష్పాల రామారావు ని DYFI ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు, జిల్లా అధ్యక్షులు నాగుల్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. DYFI సేవలను ఈ సందర్భంగా ఎస్ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ.. సమాజంలో యువత పెడదోవ పట్టకుండా DYFI జిల్లా కమిటీ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర చెడు వ్యసనాల బారి నుండి యువతను రక్షించేందుకు నిర్వహించిన “యువ చైతన్య సైకిల్ యాత్ర” వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీస్ శాఖకు ఇలాంటి ప్రజా సంఘాల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం DYFI నాయకులు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు యువతలో గొప్ప మార్పును తీసుకువస్తున్నాయని, వాటికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గంజాయి మహమ్మారిని జిల్లా నుండి పారద్రోలడానికి పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న కఠిన చర్యలను వారు అభినందించారు.









