పార్టీ బలోపేతంపై కేటీఆర్ ప్రశంసల జల్లు.. ఖమ్మం అభినందన సభలో ప్రత్యేక ఆకర్షణగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 07: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ఆత్మీయ అభినందన సభ’ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా అలింగనం చేసుకోవడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు మెచ్చా పడుతున్న శ్రమను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, కార్యకర్తల సంక్షేమంపై చర్చించిన కేటీఆర్ రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా దిశానిర్దేశం చేశారు. జిల్లా ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ఖమ్మం నగరం గులాబీమయంగా మారింది.









