కొత్త పైపులైన్‌తో ఇంటింటికీ చేరిన గంగమ్మ.. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి) జనవరి, 07: అశ్వారావుపేట మండల పరిధిలోని నారాయణపురం కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీ ప్రజల దాహార్తిని గుర్తించిన పంచాయతీ పాలకవర్గం, యుద్ధ ప్రాతిపదికన కొత్త పైపులైన్ పనులను పూర్తి చేయించి, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని, ఇప్పుడు గుమ్మం ముందుకే నీరు రావడం పట్ల స్థానికులు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ మడకం కుమారి-ఆంధ్రయ్య, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో వేగంగా పనులు పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పరిటాల సందీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని, కాలనీలో నీటి ఎద్దడి తీరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొని, సమస్యను పరిష్కరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.









