అశ్వారావుపేట మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు: చైర్మన్ పీఠం ‘జనరల్ మహిళ’కే!
వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితా విడుదల చేసిన అధికారులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 17: అశ్వారావుపేట స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల నగారాకు ముందు కీలక ఘట్టం పూర్తయింది. అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీ రిజర్వేషన్లతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ వివరాలను అధికారులు శనివారం వెల్లడించారు. అత్యంత ఆసక్తికరంగా మారిన మున్సిపల్ చైర్మన్ పదవిని ‘జనరల్ మహిళ’ కేటగిరీకి కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొత్తం 9 వార్డులకు ప్రకటించిన రిజర్వేషన్ల వివరాల ప్రకారం.. 1వ వార్డు బీసీ పురుషుడు, 2వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు బీసీ పురుషుడు, 4వ వార్డు బీసీ మహిళ, 5వ వార్డు బీసీ మహిళ, 6వ వార్డు జనరల్ మహిళ, 7వ వార్డు ఎస్సీ పురుషుడు, 8వ వార్డు జనరల్ మహిళ మరియు 9వ వార్డును ఎస్టీ పురుషుడు కేటగిరీలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో అశ్వారావుపేటలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది, ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.









