నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా చట్ట వ్యతిరేక చర్యలకు పిలుపునివ్వడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోందని అశ్వారావుపేట బీఆర్‌ఎస్ పార్టీ యూత్ నాయకుడు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, సాక్షాత్తు రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన వ్యక్తే నేరాలను ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటే ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. ద్వేషపూరిత ప్రసంగాలతో సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి తీరుపై రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనం వహిస్తున్నారని, పోలీసు వ్యవస్థ తన బాధ్యతను మరిచిపోయిందా అని నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడాలని కార్యకర్తలను ఉసిగొల్పడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని, ఇలాంటి అరాచక శక్తులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.









