అశ్వారావుపేట గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కార్యకర్తల సమన్వయంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: మెచ్చా, తాటి వెల్లడి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 24: అశ్వారావుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో శనివారం నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి అందిన 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు, అంతేకాకుండా పార్టీ సర్వేల్లో నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని, త్వరలోనే కేటీఆర్ పర్యటన కూడా ఉండబోతుందని వెల్లడించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రసంగిస్తూ పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, నాయకుల మధ్య ఉన్న సంపూర్ణ సమన్వయంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించి ప్రజల మద్దతు కూడగట్టాలని కోరారు. ఈ సందర్భంగా నేతలందరూ కలిసి ఇటీవల మరణించిన కొల్లి లాజర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చిక్కం గోపాల్ కృష్ణ నివాసంలో స్థానిక ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గం నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.









