అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండానే లక్ష్యం: అభివృద్ధి మంత్రంతో మాజీ ఎమ్మెల్యే మెచ్చా సమరశంఖం
సంక్షేమ పథకాలే మా శ్రీరామరక్ష.. సమిష్టి కృషితో క్లీన్ స్వీప్ చేద్దాం: మున్సిపల్ కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి) ఫిబ్రవరి, 02: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తుండగా, సోమవారం కాసాని చంద్రమోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు మున్సిపల్ కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ పాల్గొని అభివృద్ధి, సంక్షేమ అజెండాతో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో, హైదరాబాద్‌కు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న అశ్వారావుపేటను గత కేసీఆర్ ప్రభుత్వం ఒక మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేసిందని, రూ.24 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పట్టణానికి కొత్త శోభను తీసుకువచ్చామని గుర్తు చేస్తూనే, ప్రజల ముంగిటకే వైద్యం అందించేలా 100 పడకల ఆసుపత్రి, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్, విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు న్యాయ సేవలకు స్థానికంగానే కోర్టును మంజూరు చేయించామని వివరించారు. ఇదే క్రమంలో ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కాసాని పద్మక్కతో పాటు 22 వార్డుల అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులు నడుం బిగించాలని దిశానిర్దేశం చేస్తూ, మద్దతుగా నిలిచిన టీడీపీ నేతలు పాత్రుని కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీనులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని పిలుపునిచ్చారు. అడగకుండానే రైతుబంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఇంటింటికి చేర్చిన ఘనత తమదేనని, ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని ఆకాంక్షిస్తూనే, ఎన్నికలు శాంతియుతంగా జరగాలని వారు కోరారు; ఈ కార్యక్రమంలో నాయకులు సీతారామస్వామి, రామారావు, మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్నబాబు, దొడ్డా రమేష్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ ఐక్యతను చాటారు.









