22వ వార్డులో కాంగ్రెస్ విజయభేరి: గడపగడపకూ ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రచారం
నార్లపాటి దివాకర్ గెలుపే లక్ష్యం – సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న నేపథ్యంలో, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నార్లపాటి దివాకర్ విజయం కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేపట్టిన ఇంటింటి ప్రచారం ఓ ప్రభంజనంలా సాగింది. ఉదయం నుంచే వార్డులోని ప్రతి గల్లీలో పర్యటించిన ఎమ్మెల్యే, మహిళలు, వృద్ధులు మరియు యువతతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ మరియు రోడ్ల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకురాగా, అధికార పార్టీ ప్రతినిధిగా నిధులు మంజూరు చేయించి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికీ చేరాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, నిబద్ధత కలిగిన అభ్యర్థి దివాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థి దివాకర్ సైతం తాను గెలిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేయడంతో, వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు, భారీ జనసందోహం మధ్య ఈ ప్రచారం వార్డులో ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.









