కారేపల్లి ఐకేపీ లో కోటిన్నర కాజేశారు..
*కుంభకోణంలో గ్రామ దీపికలు సూత్రధారులు
*అప్పటి ఐకేపీ అధికారుల అండతోనే అక్రమం
*ఆర్ఆర్ యాక్టు తో జప్తులకు సిద్ధమవుతున్న ఆఫీసర్లు
కారేపల్లి, :కారేపల్లి ఐకేపీ లో మోట్ల గూడెం తరహాలో అనేక గ్రామాల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మండలంలోని పేరుపల్లి, మాదారం, పోలంపల్లి గ్రామాల్లో కోటిన్నర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఐకెపి కార్యాలయం మొండి బకాయిగా చూపిస్తున్న సుమారు కోటిన్నర రూపాయలు వాస్తవంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎగ్గొట్టిన సొమ్ము కాదు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఐకెపి అధికారులు స్థానికంగా ఉండే గ్రామ దీపికలు కుమ్మక్కై భారీ అక్రమానికి పాల్పడ్డారు. ఈ మూడు గ్రామాల్లోనీ వివిధ సంఘాల్లో సీఐఎఫ్, స్త్రీ నిధి రుణాల పేరుతో గ్రామ దీపికలు కొందరి సభ్యుల పేర్లతో బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని వాటిని ఐకెపి అధికారులతో కలిసి అక్రమంగా వాడుకున్నారు. రుణం వచ్చిన సమయంలో వారికి సంబంధించిన సభ్యులకు ఎంతో కొంత ముట్ట జెప్పి మిగతా డబ్బును తీసుకుని ఈ డబ్బంతా మేమే తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి కట్టకుండా వదిలేశారు. దీంతో ఈ గ్రూపులకు ఇచ్చినవన్నీ మొండి బకాయిల కింద నమోదయ్యాయి. వీటన్నిటిని రికవరీ చేసేందుకు అధికారులు ఆర్ఆర్ యాక్టు ను ప్రయోగించి జప్తులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కారేపల్లి ఐకెపి కార్యాలయ కేంద్రంగా గతంలో జరిగిన లావాదేవీలన్నింటిపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తే కొట్లాది రూపాయల కుంభకోణం వెలుగులోకి వస్తుంది.
*మోట్లగూడెం అక్రమంపై చర్యలు తప్పవు…
మండలంలోని మోట్లగూడెం స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో జరిగిన అక్రమంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కారేపల్లి ఐకెపి ఎపిఎం పిడమర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. మహాలో వచ్చిన కథనంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








