ఘనంగా ఎఫ్ ఎల్ ఎన్ ,బాలమేళా 2.0 గ్రంథాలయ అభ్యసన పండుగ
కరకగూడెం,నేటి గదర్:
కరకగూడెం మండలం అనంతారం కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని *ఎఫ్ ఎల్ ఎన్ బాలమేళా 2.0* *గ్రంథాలయ అభ్యసన పండుగ* కార్యక్రమాలు శనివారం ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు జి. పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. బాలమేళా సాధారణ ప్రదర్శన మేళా కాకుండా, ఇది సామర్థ్య ఆధారిత రాత పరీక్ష రూపంలో నిర్వహించబడుతుంది. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, గణితం విషయాల్లో వారి నేర్పును అంచనా వేయబడుతుంది. ప్రతి పాఠశాల నుంచి ప్రతి తరగతి నుండి ఒక విద్యార్థి కాంప్లెక్స్ స్థాయిలో పరీక్షకు హాజరవుతారు.
అదేవిధంగా, గ్రంథాలయ అభ్యసన పండుగలో భాగంగా విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కథా విన్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. గ్రంథాలయంలోని ఒక కథను ఎంపిక చేసుకుని, హావభావాలతో స్పష్టంగా కథ చెప్పే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి తరగతి నుంచి ఒక విద్యార్థి కథ చెప్పడానికి ఎంపిక చేయబడతారు.
మొత్తం ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొంటారు —
ఒకరు రాత పరీక్షకు, మరొకరు కథా విన్యాసానికి.
ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలల్లో ఆ విద్యార్థి రెండు విభాగాల్లోనూ పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమాలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే వేదికలుగా నిలుస్తాయి. వారి ప్రతిభను వెలికితీసే అవకాశాలను కల్పిస్తాయి. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
*“విద్యార్థుల పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది”* అనే సంకల్పంతో ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించేందుకు ఈ బాలమేళా గ్రంథాలయ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ *జి. వెంకటేశ్వర్లు, బి. బావ్ సింగ్, కె. సూర్యనారాయణ* , ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








