ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.శనివారం జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాష్ నగర్ రోడ్ లోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ లలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రాలలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగు నీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు.
పరీక్ష గదుల్లో వెలుతురు, త్రాగునీరు, టాయిలెట్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని దైర్యం చెప్పారు. పరీక్షా సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, బాధ్యతగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.శనివారం జిల్లాలో జరిగిన పదవ తరగతి పరీక్షకు 99.88 శాతం విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 16 వేల 962 విద్యార్థులకు గాను మొత్తం 16 వేల 941 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రం తనిఖీ సమయంలో సంబంధిత అధికారులు వెంట ఉన్నారు.








