భారత్ – శ్రీలంక మధ్య త్రేతాయుగంలో నిర్మించారని చెబుతున్న రామసేతు కాల్పనికం కాదని.. సముద్ర భూగర్భంలో రామసేతు ఉందన్న విషయం నిజమేనని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వెల్లడించింది. తమిళనాడులో రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్ ను.. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ శాట్ 2 డేటాను ఉపయోగించి రిలీజ్ చేశారు. ఇండియా – శ్రీలంకల మధ్యనున్న ఈ రామసేతు వంతెన పొడవు 29 కిలోమీటర్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. సముద్రగర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో రామసేతు ఉన్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడులోని రామేశ్వరానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపం తలైమన్నార్ వాయవ్యం వరకూ ఈ రామసేతు విస్తరించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్థారించారు. దీనిని సున్నపురాయితో నిర్మించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఇది 99.98 శాతం నీటిలోనే ఉందని వెల్లడించారు. 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ వరకూ.. అంటే ఆరేళ్ల డేటాను ఇస్రో సిద్ధం చేసింది. దీనిపై జోధ్ పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు పరిశోదనలు చేశారు.
త్రేతాయుగంలో రామాయణకాలంలో.. లంకాధిపతి అయిన రావణుడు సీతమ్మను అపహరించి లంకలోనే ఉంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హనుమంతులవారు లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడను కనుగొని రాములోరికి చెబుతాడు. వానరసైన్యంతో లంకకు చేరుకునేందుకు ఈ రామసేతును నిర్మించారు. క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకూ పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధైగా పిలిచారట. రామేశ్వరంలో ఉన్న రికార్డుల ప్రకారం.. 1480 వరకూ వచ్చిన తుపానుల కారణంగా రామసేతు ధ్వంసమైంది.
కాగా.. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం.. ఈసారి రామసేతును నిర్మించనున్నారు. భారత్ – శ్రీలంకల మధ్య ఇటీవల జరిగిన భూ మార్గం అనుసంధానం ప్రతిపాదనలపై శ్రీలంక కీలక ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య భూమార్గం నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం చివరిదశకు చేరుకున్నట్లు గత నెలలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
టెక్నాలజీలో దూసుకెళ్తున్న ఆధునిక మానవుడు.. రామసేతు ను కూడా మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని కలలు కంటున్నాడు. ఈ కల త్వరలోనే సాకారమవుతుందని ఆశిస్తున్నాడు. ఇది రామసేతునే అని దైవాన్ని నమ్మేవారు అంటుండగా.. భూ పలకల్లో చోటుచేసుకున్న మార్పు వల్ల ఏర్పడిన సహజ సిద్ధమైన నిర్మాణమని నాస్తికులు వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో రామసేతు ఉందన్న మాట వాస్తవమేనని ఇస్రో స్పష్టం చేస్తూ.. మ్యాప్ ను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. మరి మోదీ ప్రభుత్వం రామసేతు నిర్మాణంపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.