డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంపై ప్రజల ఆగ్రహం; స్వయంగా వరదను మళ్లించుకున్న గ్రామస్థులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ ప్రజలకు ప్రతి వర్షాకాలం కష్టాలను తెస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, కొద్దిపాటి వర్షానికే గ్రామం జలమయం అవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు, మంగళవారం కేవలం ఒక గంట కురిసిన వర్షానికే రోడ్లన్నీ వాగుల్లా మారిపోయాయి. ఈ వరద నీరు, మురుగు నీరు కలిసి ఇళ్లలోకి చేరడంతో నిత్యావసరాలు, ఇతర సామాగ్రి తడిసిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను తామే పరిష్కరించుకోవడానికి, వానలోనే గ్రామంలో పలువురు వరద నీటిని చెరువు వైపు మళ్లించే ప్రయత్నం చేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలం ఇంకా ముగియని నేపథ్యంలో, అధికారులు తక్షణమే స్పందించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.









