మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 16: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీరి సమ్మెకు అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. దమ్మపేట మండలం పార్కలగండిలోని సమ్మె శిబిరం వద్దకు వెళ్లి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, తమను పర్మినెంట్ చేయాలని, పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త మెనూతో పనిభారం పెరిగిందని, దీనికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్లి విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీఓ తమను బెదిరించారని, సమ్మె విరమించకపోతే వేరే కార్మికులను నియమిస్తామని అన్నారని వారు చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతాలు సకాలంలో వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలైనా జీతాలు రావడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించమని కోరినందుకు కార్మికులను బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారని విమర్శించారు. ఈ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టే ఆలోచనలు మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొడ్డా రమేష్, దారా యుగంధర్, రావుల శ్రీను జలగం వాసు, సోడెం గంగరాజు, రెడ్డిమల్ల నాగయ్య, మొగిలి కృష్ణ, వెంపటి భరత్, మల్లేష్, కాక శంకర్ ప్రసాద్, నరేంద్ర, రంగ, వెంకటేశ్వరరావు, బీమా రాజు, సూరి చలపతిరావు, మాజీ ఎంపీటీసీ కోర్స శ్రీను, మాజీ సర్పంచ్ కోర్స వెంకటేశ్వర రావు, పూనేం గోపాలరావు, మొడియం సమ్మె, వాడపల్లి ఆనంద్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.









