డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ముర్ల రమేష్ రెడ్డి వెల్లడి
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, సెప్టెంబర్, 16: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ కొండరెడ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముర్ల రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. 1976లో అప్పటి ప్రభుత్వం రాజకీయ స్వప్రయోజనాల కోసం లంబాడీలను తాత్కాలికంగా డీనోటిఫైడ్ ట్రైబ్ (డిఎన్టి) జాబితాలో చేర్చిందని రమేష్ రెడ్డి ఆరోపించారు. దీనిని ఆసరాగా చేసుకొని, లంబాడీలు ఎస్టీలుగా చలామణి అవుతూ, ఆదివాసీలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీ నాయకులపై లంబాడీ నాయకులు చేసే విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేంత వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డి, బొల్లు వెంకటేశ్వరరెడ్డి ఆదివాసి నాయకులు దుర్గారెడ్డి, బాబురెడ్డి, లచ్చిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఉమ్మల దుర్గ రెడ్డి, జాపిన్ రెడ్డి, రాజిత్ రెడ్డి, యాట్ల లక్ష్మితో పాటు పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.









