ఆపరేషన్లు విజయవంతం, ప్రభుత్వ వైద్యంపై పెరుగుతున్న విశ్వాసం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రజలకు మరింత చేరువవుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి పర్యవేక్షణలో, గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక ఒకే రోజు నాలుగు సిజేరియన్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ల ద్వారా ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఈ నాలుగు కేసులలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉండి, కాళ్లు ముందుగా ఉన్న స్థితిలో ప్రసవానికి వచ్చారు. అయినా డాక్టర్లు చాకచక్యంగా వ్యవహరించి, ఆమెకు సురక్షితంగా పురుడు పోశారు. ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు అయ్యే వైద్యం ఇక్కడ ఉచితంగా అందుతుండటంతో అశ్వారావుపేట చుట్టుపక్కల మారుమూల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. డాక్టర్ రాధ రుక్మిణి మాట్లాడుతూ, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డిసిహెచ్ఎస్ రవి బాబు సూచనల ప్రకారం రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి సిబ్బందిని రోగుల బంధువులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనికతో పాటు, హెచ్‌ఎన్ మంగతయమ్మ, ఓటీ నర్సింగ్ ఆఫీసర్ సుజాత, ఎంఎన్ఓ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.









