డిస్ట్రిబ్యూషన్ కాలువ భూ సర్వే పనులు పూర్తి చేయాలి
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతి, పెండింగ్ భూ సేకరణపై సమీక్షించిన ఖమ్మం జిల్లా కలెక్టర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తికి పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీతారామ ఎత్తిపోతల పథకంపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటిపారుదల శాఖ ఎస్ఈ పూర్తి స్థాయిలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ముఖ్యమైన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు భూ సేకరణ, అటవీ సమస్యల వల్ల వేగంగా జరగడం లేదని, పనులు వేగవంతం చేయాలని, సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ఆలస్యం కావడానికి గల ముఖ్యమైన కారణాలపై ఫోకస్ పెట్టి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ సేకరణకు సంబంధించి చెల్లింపులు డిప్యూటీ సీఎం, మంత్రివర్యుల సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. యాతాలకుంట ద్వారా జనవరి నాటికి నీరు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. యాతాలకుంట వద్ద పనులు పూర్తి చేస్తే సత్తుపల్లి నియోజక వర్గానికి గోదావరి జలాలు చేరతాయని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి 507 ఎకరాల అటవీ భూమి బదులుగా ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు చేపట్టాలని, ప్యాకేజి 13 పరిధిలో చేపట్టనున్న 10 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి అవసరమైన 167 ఎకరాల పట్టా భూముల అవార్డు పాస్ చేసి నెల రోజుల లోపు భూ బదలాయింపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్యాకేజి 14 పరిధిలో పబ్లిక్ నోటిఫికేషన్ దశలో ఉన్నవాటికి 3 నెలల్లో అవార్డు పాస్ చేయాలని, 6 ఎకరాల భూ సేకరణ వారం రోజులలో పూర్తి చేయాలని అన్నారు. ప్యాకేజి 16 పెండింగ్ భూ సేకరణ 7 రోజుల్లో పూర్తి కావాలని, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి ఖమ్మం జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రతిపాదనలు ఫైనల్ చేయాలని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ కాల్వల భూ సేకరణ సర్వే పనుల నిమిత్తం సర్వేయర్లను డిప్యూటేషన్ పై తీసుకొని రావాలని, అదనపు బృందాలు ఏర్పాటు చేసి సర్వే వేగంగా 20 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల పురోగతిని ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ లు , నీటిపారుదల శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









